భారత్‌లో నిపా వైరస్‌ కలకలం.. ఇద్దరు మృతి! | Nipah Virus Alert In Kerala After Two Unnatural Deaths | Sakshi
Sakshi News home page

భారత్‌లో నిపా వైరస్‌ కలకలం.. ఇద్దరు మృతి!

Published Tue, Sep 12 2023 9:06 AM | Last Updated on Tue, Sep 12 2023 10:39 AM

Nipah Virus Alert In Kerala After Two Person Deaths - Sakshi

తిరువనంతపురం: దేశంలో మరోసారి నిపా వైరస్‌ కలకలం సృష్టించింది. తాజాగా కేరళలో నిపా వైరస్‌ సోకి ఇద్దరు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో, కేరళలో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్‌ కారణంగా మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చేర్చారు. 

వివరాల ప్రకారం.. కేరళలో మరోసారి నిపా వైరస్‌ ప్రబలుతోంది. నిపా వైరస్‌ సోకడంతో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా కోజికోడ్‌ జిల్లాలో ఇద్దరు మృతిచెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేరళ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అప్రమత్తమైంది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నిపా వైరస్ కారణంగా ఇద్దరు మరణించారని తెలిపారు.

అలాగే, మరణించిన వారిలో ఒకరి బంధువులు కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరారు. అయితే, 2018, 2021లో కోజికోడ్ జిల్లాలోనే నిపా వైరస్ కారణంగా పలువురు మరణించారు. మన దేశంలో మొదటిసారి 2001 ప్రాంతాల్లో బెంగాల్‌లోని సిలిగురిలో ‘నిపా’ వెలుగు చూసింది. మళ్లీ ఆ తర్వాత 2007లో కేరళలో కనిపించింది. 

నిపా లక్షణాలు..
నిపా ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్‌ కలిగించి, మెదడువాపునకు (ఎన్‌సెఫలోపతి) కారణమవుతుంది. అందుకే తొలుత దీన్ని ఒకరకం మెదడువాపుగా భావించారు. ఒకసారి ఈ వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే.. 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. మెదడువాపు కారణంగా తలనొప్పి రావచ్చు. ఈ తీవ్రమైన తలనొప్పి కొందరిలో 24–48 గంటల్లో కోమాకి దారితీయవచ్చు.

ఇది సోకినవారిలో.. అన్ని వైరల్‌ ఇన్ఫెక్షన్‌లోలాగానే.. జ్వరం, ఒళ్లునొప్పులు, వికారం, వాంతులు కనిపించవచ్చు. దేహంలో దీర్ఘకాలికంగా వైరస్‌ ఉంటే మూర్ఛ (కన్వల్షన్స్‌), ప్రవర్తనలో మార్పులు (పర్సనాలిటీ ఛేంజెస్‌) కనిపించవచ్చు. మెడ బిగుసుకుపోవడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఇక కొందరిలో అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌ (ఏఆర్‌డీఎస్‌)లోలా ఊపిరి అందకపోవచ్చు. గుండె కండరానికి ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు, మంట) వచ్చేలా ‘మయోకార్డయిటిస్‌’కు దారితీయవచ్చు.  

అకస్మాత్తు మరణం..
అరుదుగా కొందరిలో లక్షణాలేవీ కనిపించకుండానే అకస్మాత్తుగా  మరణం కూడా సంభవించవచ్చు. అయితే ఇది అరుదు. నిపా వైరస్‌ను సంక్షిప్తంగా ‘ఎన్‌ఐవీ’ అంటుంటారు. ఇదో రకం ‘ఆర్‌ఎన్‌ఏ వైరస్‌’. మలేషియాలోని  ‘కాంపంగ్‌ షుంగై నిపా’ అనేచోట 1998లో వ్యాపించడంతో ఆ ప్రదేశం పేరిట దీన్ని ‘నిపా’ అంటున్నారు. ఆరేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో కనిపించింది. అప్పట్నుంచి ఇది అప్పుడప్పుడూ భారత్, బంగ్లాదేశ్‌లో కనిపించడం మొదలుపెట్టింది.  

వ్యాప్తి ఇలా...
ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్‌. తాటి జాతికి చెంది డేట్‌పామ్‌ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్‌ బ్యాట్స్‌)తో ఈ వైరస్‌ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్‌ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి.

‘నిపా’ ఫ్రూట్‌ బ్యాట్‌ రకానికి చెందిన గబ్బిలాల నుంచి, పందుల నుంచి, అలాగే.. ఇన్ఫెక్షన్‌ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది. ఇక నిపా సోకిన వ్యక్తులు పీల్చి వదిలే గాలి (ఏరోసాల్స్‌) వల్ల కాకుండా.. వారి నుంచి వచ్చే తుంపర్లు (డ్రాప్‌లెట్స్‌) వల్లనే దీని వ్యాప్తి జరుగుతుందని గుర్తించారు. అయితే ఇప్పటికే కరోనా కారణంగా మనం ధరించే మాస్కులతో దీని నివారణ కూడా జరుగుతుంది కాబట్టి.. మాస్క్‌ అదనపు / రెట్టింపు ప్రయోజనాలను ఇస్తోందని గ్రహించి, వాటిని తప్పనిసరిగా ధరించడం మంచిది.  

ఇది కూడా చదవండి: క్యాన్సర్‌ కణాలకు చెక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement