తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ విజృంభిస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ బారినపడి ఇప్పటికే రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి వైరస్ సోకింది. ఇందులో తొమ్మిది ఏళ్ల చిన్నారి కూడా ఉంది. దీంతో ప్రభుత్వం కోజికోడ్ జిల్లాలోని ఏడు గ్రామ పంచాయితీలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు, కార్యాలయాలను మూసివేయాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటివరకు రాష్ట్రంలో నిఫా వైరస్ 130 మందికి సోకిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్‌గా పేర్కొన్న ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.. మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. వ్యాప్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య అధికంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు.
కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించిన ఏడు గ్రామ పంచాయితీల్లో ఎలాంటి రాకపోకలు జరపరాదని కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఏ గీతా తెలిపారు. ఆతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలు కంటైన్‌మెంట్ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయం తర్వాత దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామశాఖ ఆఫీస్‌లు తక్కువ స్టాఫ్‌తో నడపాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూసివేయాలని కోరారు. కంటైన్‌మెంట్ జోన్‌లో మాస్కులు తప్పనిసరి అని తెలిపారు. శానిటైజర్లు వాడాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చెప్పారు.
రాష్ట్రంలో నిఫా వైరస్ వ్యాప్తి పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బృందాలు కేరళకు రానున్నాయి. కోజికోడ్ మెడికల్ కాలేజీలో సంచార ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పందులు, గద్దల నుంచి మనుషులకు వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు చేయనున్నారు.
వ్యాప్తి ఇలా...
ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్. తాటి జాతికి చెంది డేట్‌పామ్ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్)తో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి.
ఇదీ చదవండి: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు..
Comments
Please login to add a commentAdd a comment