ప్రేమ, పెళ్లి అంటూ...మోసం
► ప్రియురాలి ఇంట్లో ఉండగా ప్రియుడిని నిర్బంధించిన కుటుంబ సభ్యులు
► ఇంటికి తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు
ప్రేమించానని నమ్మించాడు...పెళ్లి చేసుకుంటానని ప్రియురాలిని నమ్మబలికాడు. శారీరక సంబంధం కొనసాగిస్తూ ఆమెను మోసం చేయాలని చూశాడు. దీంతో మోసపోతున్నానని గుర్తించిన ప్రియురాలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని ప్రశ్నించింది. ఇదిగో...అదిగో...అన్నాడే తప్ప వివాహానికి అంగీకారం తెలపలేదు. దీంతో ప్రియురాలి అక్కబావలు విషయం గుర్తించి ప్రియురాలితో ప్రియుడు కలిసి ఉండగా ఇంటికి తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే...
గంట్యాడ(గజపతినగరం): కొండతామరాపల్లి ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న దాసరి రాధ విజయనగరం ఎంఆర్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతుంది. రాధకు తొమ్మిది నెలల కిందట జామి మండలం భీమసింగి గ్రామానికి చెందిన బోడసింగి కోటేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో కోటేశ్వరరావు తరచూ రాధ ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. నిన్ను ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకుంటానని రాధను నమ్మించాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడి కొనసాగిస్తూ వచ్చాడు. ఈ విషయం కాస్త రాధ అక్క, బావలకు తెలిసింది. దీంతో రాధను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని కోటేశ్వరరావును ప్రశ్నించారు. తమ కుటుంబ పెద్దలకు విషయం చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంటానని తప్పించుకునేవాడు.
కచ్చితంగా ఏ విషయం చెప్పే వాడు కాదు. దీంతో బుధవారం రాత్రి తామరాపల్లిలోని రాధ ఇంటికి వచ్చిన కోటేశ్వరరావును మరోసారి అడగ్గా సమాధానం దాటవేశాడు. గురువారం కూడా కోటేశ్వరరావు రాధతో ఇంట్లో ఉండగా అక్కబావలు ఇంటి గ్రిల్స్‌కు తాళం వేసి నిర్బంధించారు. అనంతరం గంట్యాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాధకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన పోలీసులు కొండతామరాపల్లి వెళ్లి గృహ నిర్బంధంలో ఉన్న ప్రేమికులను స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు.