ఆనందపురం: కిరాయికి హత్య చేసిన వ్యక్తే.. కిరాయి ఇచ్చిన వ్యక్తుల చేతిలో హతమయ్యాడు. ఒడిశాకు చెందిన వ్యక్తిని హత్య చేసి గండిగుండానికి సమీపంలో కొండపై గల కందకంలో పడేయగా ఆనందపురం పోలీసుల సాయంతో ఒడిశా పోలీసులు దర్యాప్తు జరిపి కేసును ఛేదించారు. శుక్రవారం వెలుగు చూసిన సంఘటన వివరాలివీ.. ఒడిశా రాష్ట్రం గుణుపురం ప్రాంతానికి చెందిన రాజేటి కృష్ణ, అతని బావమరిది గోవింద్, వడ్డాది రాజేష్ అలియాస్ రాజా స్నేహితులు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కృష్ణ, ఒడిశాలోని గుణుపురానికి చెందిన సమాజ సేవకుడు గౌరీప్రసాద్ మిశ్రాల మధ్య భూ తగదాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా కృష్ణ గతేడాది నుంచి వ్యాపారం నిమిత్తం విశాఖలోనే ఉంటున్నాడు. ఇటీవల కృష్ణ, గౌరీప్రసాద్‌ల మధ్య వివాదాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ప్రసాద్‌ను మట్టు బెట్టాలని కృష్ణ పథకం వేశాడు. తన బావమరిది గోవింద్‌తో కలిసి మిత్రుడైన రాజేష్‌తో ఈ విషయంపై చర్చించాడు. అంతా అనుకున్నట్లు జరిగితే రూ.15 లక్షలు ఇస్తానని బేరం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు అందుకున్న రాజేష్.. మే13న గౌరీప్రసాద్ మిశ్రాను ఒడిశాలోనే తుపాకీతో కాల్చి హతమార్చాడు. అనంతరం పరారయ్యాడు.
తల్లికి ఫోన్ చేయడంతో..
హత్యానంతరం తనకు రావాల్సిన రూ.13 లక్షల సుపారీ సొమ్మును ఇవ్వాలని రాజేష్ తరచూ కృష్ణను అడగడం మొదలుపెట్టాడు. ఎంతకూ ఇవ్వక పోవడంతో హత్య ఘటన విషయం పోలీసులకు చెబుతానని బెదిరించాడు. అదే సమయంలో గౌరీప్రసాద్ హత్య కేసును పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన కృష్ణ.. రాజేష్ అడ్డు తొలగించుకుంటే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, కేసు నుంచి బయట పడవచ్చని భావించాడు. ఈ మేరకు విశాఖపట్నం వస్తే మిగతా రూ.13 లక్షలు చెల్లిస్తానని నమ్మబలికాడు. దీంతో ఈనెల 19న రాజేష్ రైలులో విశాఖపట్నం చేరుకున్నాడు.
ముందుగా రాజేష్‌ను బెదిరించిన రాజేష్, కృష్ణ.. అతను ఎంతకీ లొంగక పోవడంతో పార్టీ చేసుకుందామని చెప్పి గండిగుండం వైపు తీసుకు వెళ్లారు. ఈలోగా రాజేష్ బెంగళూరులో ఉంటున్న తన తల్లి లక్ష్మీకి ఫోన్ చేసి, వారిద్దరూ బెదిరిస్తున్నారని.. భయంగా ఉందని చెప్పాడు. అప్పటి నుంచి రాజేష్ ఫోన్ పనిచేయక పోవడం, అతని నుంచి ఎటువంటి సమాచారం లేక పోవడంతో లక్ష్మి ఈనెల 25న గుణుపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కుళ్లిపోయే దశలో..
ఈ మేరకు కేసు నమోదు చేసిన ఒడిశా పోలీసులు.. కృష్ణ, గోవిందలను అదుపులోకి తీసుకుని విచారించారు. తామే రాజేష్‌ను హతమార్చినట్లు వారు అంగీకరించారు. రాజేష్‌కు మద్యం తాగించి, తాడుతో ఉరివేశామని, అనంతరం ఆనందపురం మండలంలోని గండిగుండం శివారు కంబాల కొండపై 10 అడుగుల లోతులోని కందకంలో మృతదేహాన్ని పూడ్చి పెట్టామని ఒప్పుకున్నారు. హత్య చేసిన 2రోజుల తరువాత మరోసారి అక్కడకు వెళ్లి, మృతదేహం త్వరగా కుళ్లి పోయేందుకు 25కిలోల ఉప్పు చల్లడంతో పాటు మట్టితో పూడ్చామని వివరించారు.
ఈ మేరకు నిందితుడు కృష్ణను తీసుకుని ఘటనా స్థలానికి శుక్రవారం తీసుకు వెళ్లిన పోలీసులు.. కుళ్లిపోయిన దశలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీశారు. రాజేష్ తల్లి లక్ష్మి, భార్య మంగ గుర్తుపట్టిన అనంతరం భీమిలి ఆస్పత్రి వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు జరిపారు. ఆనందపురం సీఐ రామచంద్రరావు, ఎస్‌ఐ నర్సింహమూర్తి కేసు దర్యాప్తులో ఒడిశా పోలీసులకు సహకరించారు.
Comments
Please login to add a commentAdd a comment