ఫ్రమ్ ఇరాక్ విత్ లవ్ ....!
ఎక్కడో ఇరాక్ నుంచి బయలుదేరుతుంది. ఆ తరువాత ముంబాయి తీరానికి చేరుకుంటుంది. అక్కడ నుంచి గుజరాత్ వ్యాపారుల గోడౌన్లలోకి వెళ్తుంది. అక్కడ నుంచి మన హైదరాబాద్ లోకి బేగం బజార్ లోకి, అక్కడినుంచి పాత బస్తీ వీధులు, సందుల్లోని మసీదుల్లోకి, దుకాణాల్లోకి, ఇళ్లలోకి వస్తాయి. రంజాన్ నెల వచ్చిందంటే చాలు దానికి భలే డిమాండ్!
జహేదీ, అజ్వా, మేడ్ జోల్, కలిమీ, రుక్సానా ఇలా వేర్వేరు వెరైటీల రూపంలో అవి దొరుకుతాయి. అవి లేకపోతే రంజాన్ ఉపవాస దీక్ష (రోజా) ను సాయంత్రం నమాజుకు ముందు విడిచిపెట్టలేరు. ఇంతకీ అవేమిటని అనుకుంటున్నారు కదూ. అవే ... ఖర్జూరాలు.
గుండె నిండా భక్తిపూర్వక నమాజు, నోటి నిండా గుప్పెడు తియ్యతియ్యని ఖర్జూరాలు.... రంజాన్ నెలంతా కనిపించే దృశ్యాలు ఇవే. ఇరాక్ లో ప్రస్తుతం భయంకరమైన అంతర్యుద్ధం నడుస్తున్నా మన దేశానికి ఖర్జూరం దిగుమతులు ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఖర్జూరాలను గత నవంబర్ లోనే సేకరించి, కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరిచారు. అంతర్యుద్ధ ప్రారంభానికి ముందే ఖర్జూరాలు గుజరాత్ చేరుకున్నాయి. అందుకే ఈ సారి పెద్దగా ఖర్జూరాల ధరలు పెరగలేదు.
అయితే ఖర్జూరం వ్యాపారులు మాత్రం ఖర్జూరాలను డ్రైఫ్రూట్స్ కేటగరీ నుంచి ఫ్రూట్స్ కేటగరీలో చేరిస్తే బాగుంటుందని అంటున్నారు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ పై 12 శాతం వ్యాట్ పన్ను ఉంటుంది. పండ్ల పైన అంత పన్ను ఉండదు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ లలో ఖర్జూరాలను డ్రైఫ్రూట్స్ శ్రేణి నుంచి తొలగించారు. మన రాష్ట్రంలోనూ అలా చేస్తే బాగుంటుందని వ్యాపారులు అంటున్నారు.