నో పార్కింగ్ జోన్‌గా మద్రాసు హైకోర్టు
అన్నానగర్: మద్రాసు హైకోర్టు సోమవారం వాహనాల రద్దీ లేకుండా ప్రశాంతంగా కన్పించింది. కారణం ఏమిటా అని ఆరా తీస్తే సెప్టెంబరు ఎనిమిదో తేదీ నుంచి మద్రాసు హైకోర్టును నో పార్కింగ్ జోన్‌గా అమలు చేయనున్నారని తెలిసింది. ఈ క్రమంలో సోమవారం హైకోర్టులోకి కేవలం లాయర్లు - జడ్జిల వాహనాలను మాత్రమే అనుమతించారు. పిటిషనర్లూ - సందర్శకుల వాహనాలను లోనికి అనుమతించలేదు. కోర్టు క్యాంపస్ ఆవరణ ప్రహరీ గోడకు చేరువుగా సందర్శకులూ - పిటిషనర్లు తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చని కోర్టు వర్గాలు తెలిపాయి.
రెండు నెలల పాటు ఈ అమలును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని తెలిపాయి. రాత్రి 8 గంటల వరకూ న్యాయవాదులు, న్యాయమూర్తుల వాహనాలను కోర్టులోకి అనుమతిస్తామన్నారు. మద్రాసు బార్ అసోసియేషన్ ఈ మేరకు నిర్దిష్టమైన ప్రణాళికను అమలు పర్చనున్నట్లు తెలిపింది. కోర్టులోకి నిత్యం మూడు వేలకు పైగా వాహనాల రాకపోకలుంటాయని, ఇందువల్ల కోర్టులో కాలుష్యం స్థాయి పెరుగుతోందన్నారు.
కోర్టు దక్షిణ గేటు క్యాంపస్, జ్యూడీషియల్ ఆఫీసర్స్ ప్రవేశ ద్వారం మెట్రో బస్టాండ్‌కు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాలను కోర్టు ఉద్యోగుల వాహనాల పార్కింగ్ కోసం రిజర్వు చేశామన్నారు. ఎస్పన్లేడ్ గేటు, ఇండియన్ బ్యాంకు, మన్నేటిచోళన్ విగ్రహం 20 అడుగుల రోడ్డు, న్యూ అడ్వొకేట్స్ క్యాంటీన్, పాత లా ఛాంబరు వంటి ఆరు ప్రదేశాల ద్వారా మాత్రమే పిటిషన్ దార్లు, సందర్శకులు మద్రాసు హైకోర్టులోకి ప్రవేశించాల్సి ఉంటుందని మద్రాసు బార్ అసోసియేషన్ కార్యదర్శి వి.ఆర్.కమలనాధన్ తెలిపారు.