No parking zone
-
మందుబాబుల హల్చల్.. పార్కింగ్ హడల్..! అధికారుల పట్టింపు మాత్రం ఫుల్ నిల్..!!
ఆదిలాబాద్: జిల్లాకేంద్రంలోని పలు వైన్స్ షాపుల ఎదుట మందుబాబులు హల్చల్ చేస్తున్నారు. పర్మిట్ రూమ్‌లు ఉన్నప్పటికీ రోడ్డుపైనే మద్యం తాగుతూ మత్తులో తూగుతున్నారు. ప్రధానంగా రోడ్లను ఆనుకొని ఉన్న వైన్స్‌ల వద్ద మహిళలు, విద్యార్థినులకు భద్రత కరువవుతోంది. ఈ దారిగుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు. జిల్లాకేంద్రంలోని దస్నాపూర్, కలెక్టర్‌చౌక్, వినాయక్‌చౌక్, బస్టాండ్ ప్రాంతం, తెలంగాణచౌక్, పంజాబ్చౌక్లలో వైన్స్‌లు, బార్లు రోడ్డుకు ఆనుకొని ఉండడంతో మందుబాబులు రోడ్లపైనే ఇష్టారాజ్యంగా మందు తాగుతున్నారు. కట్టడి చేయాల్సిన పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. -
Mumbai: న్యూ ఇయర్ వేడుకలు.. నగరంలో ట్రాఫిక్ నిబంధనలు..
ముంబై(మహారాష్ట్ర): నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ట్రాఫిక్ పోలీసులు వర్లీలో పార్కింగ్ నిబంధనలు జారీ చేశారు. గేట్‌వే ఆఫ్ ఇండియా, మెరీనా డ్రైవ్, నారీమన్ పాయింట్ ప్రాంతాల్లో పలు ట్రాఫిక్ షరతులను విధించారు. డిసెంబర్ 31 రాత్రి ఎనిమిది గంటల నుంచి జనవరి 1న ఉదయం ఆరు గంటలవరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. కొత్త సంవత్సర సంబురాలను జరుపుకొనేందుకు ముఖ్యంగా గేట్‌వే ఆఫ్ ఇండియా, కొలాబా, మెరీన్డ్రైవ్, నారీమన్‌పాయింట్, ఇతర సముద్ర తీరాలు, బీచుల్లో, హోటల్స్, క్లబ్‌ల వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ డీసీపీ (సౌత్) గౌరవ్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వాటి ప్రకారం కొన్ని ప్రాంతాల్లో పార్కింగ్ అనుమతులు ఉండవన్నారు. కొన్నిచోట్ల రోడ్లు మూసివేస్తారని పేర్కొన్నారు. అందుకు ప్రత్యామ్నాయ దారులను సూచించారు. మూసేసే దారులు ఇవే.. ► ఎన్ఎస్ రోడ్ నార్త్ బౌండ్లోని ఎన్సీపీఏ నుంచి ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లైఓవర్‌వరకు అన్ని రకాల వాహనాలకు అనుమతులు లేవు (ప్రిన్సెస్ స్ట్రీట్ నుంచి ఎన్ఎస్ రోడ్‌కు వచ్చే మార్గం ఓపెన్ ఉంటుంది) ► మేడమ్ కామారోడ్ నార్త్ బౌండ్ నుంచి మంత్రాలయ జంక్షన్, ఎయిర్ ఇండియా జంక్షన్ వరకు ► ఫ్రీప్రెస్ జర్నల్మార్గ్ (స్థానికులకు మాత్రమే అనుమతి) ► ఛత్రపతి శివాజీ మహరాజ్ మార్గంలో సౌత్‌బౌండ్ పార్కింగ్ అనుమతులు లేని ప్రాంతాలు ఎన్ఎస్ రోడ్, మేడమ్ కామారోడ్, వీర్ నారీమణ్ రోడ్, ఛత్రపతి శివాజీ మార్గ్, మహాకవి భూషణ్ మార్గ్, ఆడమ్ స్ట్రీట్, హెన్రీరోడ్, హాజీ నియాజ్ అహ్మద్ అజ్మీ మార్గ్, పీజే రామ్‌చందానీ మార్గ్, బెస్ట్మార్గ్, మహర్షి కార్వే మార్గ్. వర్లీలో నో పార్కింగ్ నోపార్కింగ్ ప్రాంతాల జాబితాను ట్రాఫిక్ డీసీపీ రాజ్ తిలక్ రోషన్ బుధవారం విడుదల చేశారు. కొత్త సంవత్సర సంబరాలను జరుపుకొనేందుకు వర్లీ సీఫేస్ చౌపట్టీలో ఎక్కువమంది వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిబంధనలు విడుదలచేశారు. సొంత వాహనాల్లో వచ్చేవారు తమ వాహనాలను మేలా జంక్షన్ నుంచి జేకే కపూర్ చౌక్ మధ్య ఉన్న ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ రోడ్లో పార్క్ చేస్తుండటం వల్ల అది ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతుందన్నారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని నో పార్కింగ్ జోన్‌గా ప్రకటించారు. అన్ని రకాల వాహనాలనూ నిషేధిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 1న ఉదయం ఆరు గంటల వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించారు. చదవండి: New Year Restrictions: కరోనా విజృంభణ.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. -
ట్యాంక్‌బండ్‌పై నిర్లక్ష్యంగా బండి పెడితే రూ. 1000 పడుద్ది!
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై ఇక నుంచి ఎక్కడంటే అక్కడ వాహనాలు పార్కింగ్ చేసేందుకు కుదరదు. నిర్దేశించిన స్థలాల్లో మాత్రమే వాహనాలను నిలపాల్సి ఉంటుంది. రోడ్డు పక్కన బైక్ ఆపుకొని అలా హుస్సేన్‌సాగర్‌ను చూస్తామంటే రూల్స్ ఒప్పుకోవు. నో పార్కింగ్ జోన్లో వాహనం పార్కింగ్ చేశారో క్షణాల్లో మొబైల్ ఫోన్‌కు రూ.1000 జరిమానా విధిస్తూ సందేశం వస్తుంది. నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసిన చోట్ల స్పీడ్ గన్లను కూడా ఫిక్స్ చేశారు. నిమిషం పాటు అలా వెళ్లి వస్తామని నిర్లక్ష్యంగా పార్కింగ్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నో పార్కింగ్ బోర్డులు అడుగడుగునా ఏర్పాటు చేసి ఒక వేళ పార్కింగ్ చేస్తూ రూ.1000 జరిమానా అంటూ రాయడంతో ఇక వాహనదారులు అప్రమత్తం కావాల్సిందే. చదవండి: మాస్టారు పాడె మోసిన మంత్రి ‘ఎర్రబెల్లి’ -
నా జీవితంలో జరిగినవే సినిమాలో చూపించా: డైరెక్టర్
సుశాంత్, మీనాక్షీ చౌదరి జంటగా ఎస్. దర్శన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇచట వాహనములు నిలుపరాదు’. రవిశంకర్ శాస్త్రి (దివంగత ప్రముఖ నటి భానుమతి మనవడు), ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఈ చిత్రదర్శకుడు ఎస్. దర్శన్ మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు కేశన్ తమిళంలో కొన్ని సినిమాలకు, తెలుగులో ‘యమగోల: మళ్ళీ మొదలైంది’కి దర్శకులు శ్రీనివాస్‌రెడ్డిగారి దగ్గర దర్శకత్వ శాఖలో చేశారు. శ్రీనివాస్‌రెడ్డిగారి ‘ఢమరుకం’కు అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. ఇక ‘ఇచట వాహనములు నిలుపరాదు’ విషయానికి వస్తే... పదేళ్ల క్రితం నాకు, నా స్నేహితుడికి జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశా. ఒక రోజులో జరిగే కథ ఇది. నో పార్కింగ్ ఏరియాలో బండి పార్క్ చేయడం వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అన్నదే కథ. ఓటీటీ ఆఫర్స్ వచ్చినప్పటికీ థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు. చదవండి : బాలకృష్ణ ఆనాడు దారుణంగా అవమానించాడు : కోట త్రిష ప్రత్యేక పూజలు -
స్టేషన్‌కు వెళ్లి మరీ ట్రాఫిక్ ఎస్సైపై దాడి.. కత్తితో కడుపులో..
భోపాల్: భోపాల్‌లో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసును కత్తితో కడుపులో పొడిచాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ‘‘నిందితుడు హర్ష్ మీనా శనివారం జ్యోతి టాకీస్‌కు వెళ్లాడు. అక్కడ అతను తన బైక్‌ను నో పార్కింగ్ జోన్లో పార్క్ చేశాడు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ దూబే, నో పార్కింగ్ జోన్లో పార్క్ చేసిన వాహనాలను పోలీసు క్రేన్ సహాయంతో ఎత్తి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే సమాచారం అందుకున్న హర్ష్ మీనా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. జరిమానా డబ్బులు రూ.600 చెల్లించడానికి ఇంటికి వెళ్లి వచ్చి డిపాజిట్ చేశాడు. అదే సమయంలో పోలీస్ స్టేషన్ వద్ద క్రేన్ దగ్గర నిలబడి ఉన్న ఎస్ఐ శ్రీరామ్ దూబేని నిందితుడు చూశాడు. అతడి దగ్గరకు వెళ్లి ఎస్ఐను కత్తితో కడుపులో పొడిచాడు. కాగా నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. క్రేన్ దగ్గర ఉన్న వ్యక్తులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే జరిమానా డిపాజిట్ చేసిన తర్వాత నిందితుడు ట్రాఫిక్ పోలీసును పై కత్తితో ఎందుకు దాడి చేశాడనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అంతే కాకుండా విచారణ సమయంలో నిందితుడు పలు రకాల సమాధానాలు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక నిందితుడు స్టేషన్లో సైకో లాగా ప్రవర్తించాడని, పెద్దగా నవ్వడం, అరవడం వంటివి చేశాడని పోలీసులు తెలిపారు. కాగా ఎస్ఐ దుబేను చికిత్స కోసం జేపీ ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్సీ రాజేష్ భదౌరియా తెలిపారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఎస్ఐని డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. -
ఇదేంది..పంతులూ..!
కేపీహెచ్‌బీకాలనీ: నో పార్కింగ్ ఏరియాలో కారును పార్కు చేయవద్దన్నందుకు ఓ సెక్యూరిటీ గార్డును జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ చితకబాదిన సంఘటన శనివారం జేఎన్టీయూ హెచ్లో చోటు చేసుకుంది. ఎంత దైర్యంరా నీకు నా కారునే పెట్టవద్దంటావా...నా కొడుకుతో వాగ్వాదానికి దిగుతావా అంటూ దుర్భాషలాడటమేగాకుండా ఎవడు పెట్టవద్దన్నాడో చెప్పాలంటూ ప్రిన్సిపాల్ ఛాంబర్ వరకు వెంటబడి మరీ కొట్టాడు. తోటి ఉద్యోగులు వారించినా వినకుండా చెప్పు తీసుకుని సెక్యూరిటీ గార్డుపై దాడికి యత్నించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే...జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల స్పందన బ్లాక్ ఎదుట వాహనాలు పార్కు చేయకుండా పార్కింగ్ ఏరియాలోనే పార్కు చేసేలా చూడాలన్న ప్రిన్సిపాల్ ఆదేశిస్తూ ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నో పార్కింగ్ ఏరియాలో వాహనాలు నిలుపకుండా సెక్యూరిటీ గార్డు కాశిరాములు విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఫిజిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు తనయుడు తన తల్లి సహా వర్సిటీకి వచ్చి నో పార్కింగ్ ఏరియాలో కారు నిలిపాడు. దీంతో సెక్యూరిటీ గార్డు కాశీరాం అందుకు అభ్యంతరం చెప్పడంతో తాను ప్రొఫెసర్ కొడుకునని, తనకే అడ్డు చెబుతావా అంటూ వాగ్వాదానికి దిగాడు. అతను వారించినా వినకుండా కారును పార్కుచేసిన ప్రొఫెసర్ తనయుడు లోపలికి వెళ్లి ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. దీంతో కోపంతో ఊగిపోతూ బయటికి వచ్చిన ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు సెక్యూరిటీగార్డును అందరి ముందు బూతులు తిడుతూ మొఖంపై, మెడపై గాయాలయ్యేలా చితకబాదాడు. అంతేగాకుండా ప్రిన్సిపాల్ గదివరకూ కొట్టుకుంటూ తీసుకెళ్లాడు. సిబ్బంది వారించినా పట్టించుకోకుండా తన చెప్పు తీసి కొట్టేందుకు యత్నించాడు. చివరకు సెక్యూరిటీ గార్డు తనను క్షమించాలని, తప్పయిందంటూ వేడుకున్నాడు. తన కొడుకు కాళ్లు పట్టుకుంటే వదిలేస్తానని చెప్పడంతో కాశీరాములు ప్రొఫెసర్ కొడుకు కాళ్లు పట్టుకున్నాడు. అతను శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడంతో యూనివర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా గతంలోనూ వెంకటేశ్వరరావు సెక్యూరిటీ గార్డులను బూతులు తిట్టినా ఎవరూ పట్టించుకోలేదని, దీంతో మరింత రెచ్చిపోయి ఏకంగా భౌతికదాడులకు దిగుతున్నాడని ఆరోపించారు. ఈ విషయమై జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ యాదయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా సంఘటన తమ దృష్టికి వచ్చిందని, అయితే ప్రిన్సిపాల్ నుంచి నివేదిక వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఒకే నంబర్‌తో రెండు బైక్‌లు
గోవిందరావుపేట : ఒకే నంబర్‌తో పల్సర్ టూవీలర్ బండ్లు రెండు కనిపించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే చల్వాయికి చెందిన సాయబోయిన భిక్షపతి, మోహన్ అన్నదమ్ములు. భిక్షపతి హన్మకొండలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన వద్దే ఉంటున్న తమ్ముడికి బైక్ కొని ఇచ్చాడు. మోహన్ భూపాలపల్లిలో రిజిస్ట్రేషన్ చేయించుకోగా అతనికి టీఎస్ 25 0468 నెంబర్‌ను కేటాయించారు. ఈ క్రమంలో అదే నెంబర్‌పై హైదరాబాద్‌లో ఓ బ్లాక్పల్సర్ బండిపై మరో వ్యక్తి తిరుగుతున్నాడు. గత 20 రోజుల వ్యవధిలో మూడుసార్లు బండి విషయంలో తప్పులు దొర్లడంతో సీసీ కెమెరాల ఫుటేజీల ఆదారంగా అక్కడి ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తూ ఆ నెంబర్‌పై రిజిస్ట్రేషన్‌లో ఉన్న మోహన్ సెల్ నెంబర్‌కు మెసేజ్‌లు పంపారు. దీంతో అన్నయ్య భిక్షపతికి తెలుపగా ఆన్లైన్లో చూశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో హెల్మెట్ లేకుండా, నీలోఫర్ ఆస్పత్రి ఎదుట రెండు రోజుల పాటు నో పార్కింగ్ జోన్లో వాహనం నిలిపినందుకు రెండు సార్లు జరిమానాలు విధిస్తున్నట్లు కనిపించింది. దీంతో అవాక్కయిన మోహన్ జరిగిన విషయాలను పస్రా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
మా రూల్స్.. మేమే పాటించం
పంజగుట్ట సర్కిల్లో హైదరాబాద్ సెంట్రల్ ముందు నో పార్కింగ్ బోర్డును పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇక్కడ పార్కింగ్ చేస్తే ఫొటోలు తీసుకొని ఈ–చలానాలు పంపిస్తుంటారు. అయితే పోలీసు వెహికల్ మాత్రం నిత్యం ఇక్కడే పార్కింగ్ చేసి ఉంటుంది. మరి చలానా వేసి ఎవరికి పంపుతారో..! -
నో పార్కింగ్ జోన్‌గా మద్రాసు హైకోర్టు
అన్నానగర్: మద్రాసు హైకోర్టు సోమవారం వాహనాల రద్దీ లేకుండా ప్రశాంతంగా కన్పించింది. కారణం ఏమిటా అని ఆరా తీస్తే సెప్టెంబరు ఎనిమిదో తేదీ నుంచి మద్రాసు హైకోర్టును నో పార్కింగ్ జోన్‌గా అమలు చేయనున్నారని తెలిసింది. ఈ క్రమంలో సోమవారం హైకోర్టులోకి కేవలం లాయర్లు - జడ్జిల వాహనాలను మాత్రమే అనుమతించారు. పిటిషనర్లూ - సందర్శకుల వాహనాలను లోనికి అనుమతించలేదు. కోర్టు క్యాంపస్ ఆవరణ ప్రహరీ గోడకు చేరువుగా సందర్శకులూ - పిటిషనర్లు తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చని కోర్టు వర్గాలు తెలిపాయి. రెండు నెలల పాటు ఈ అమలును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని తెలిపాయి. రాత్రి 8 గంటల వరకూ న్యాయవాదులు, న్యాయమూర్తుల వాహనాలను కోర్టులోకి అనుమతిస్తామన్నారు. మద్రాసు బార్ అసోసియేషన్ ఈ మేరకు నిర్దిష్టమైన ప్రణాళికను అమలు పర్చనున్నట్లు తెలిపింది. కోర్టులోకి నిత్యం మూడు వేలకు పైగా వాహనాల రాకపోకలుంటాయని, ఇందువల్ల కోర్టులో కాలుష్యం స్థాయి పెరుగుతోందన్నారు. కోర్టు దక్షిణ గేటు క్యాంపస్, జ్యూడీషియల్ ఆఫీసర్స్ ప్రవేశ ద్వారం మెట్రో బస్టాండ్‌కు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాలను కోర్టు ఉద్యోగుల వాహనాల పార్కింగ్ కోసం రిజర్వు చేశామన్నారు. ఎస్పన్లేడ్ గేటు, ఇండియన్ బ్యాంకు, మన్నేటిచోళన్ విగ్రహం 20 అడుగుల రోడ్డు, న్యూ అడ్వొకేట్స్ క్యాంటీన్, పాత లా ఛాంబరు వంటి ఆరు ప్రదేశాల ద్వారా మాత్రమే పిటిషన్ దార్లు, సందర్శకులు మద్రాసు హైకోర్టులోకి ప్రవేశించాల్సి ఉంటుందని మద్రాసు బార్ అసోసియేషన్ కార్యదర్శి వి.ఆర్.కమలనాధన్ తెలిపారు.