సెక్యూరిటీగార్డుపై దాడి చేస్తున్న వెంకటేశ్వరరావు , వెంకటేశ్వరరావు , కాశిరాములు
కేపీహెచ్‌బీకాలనీ: నో పార్కింగ్ ఏరియాలో కారును పార్కు చేయవద్దన్నందుకు ఓ సెక్యూరిటీ గార్డును జేఎన్‌టీయూహెచ్ ప్రొఫెసర్ చితకబాదిన సంఘటన శనివారం జేఎన్‌టీయూ హెచ్‌లో చోటు చేసుకుంది. ఎంత దైర్యంరా నీకు నా కారునే పెట్టవద్దంటావా...నా కొడుకుతో వాగ్వాదానికి దిగుతావా అంటూ దుర్భాషలాడటమేగాకుండా ఎవడు పెట్టవద్దన్నాడో చెప్పాలంటూ ప్రిన్సిపాల్ ఛాంబర్ వరకు వెంటబడి మరీ కొట్టాడు. తోటి ఉద్యోగులు వారించినా వినకుండా చెప్పు తీసుకుని సెక్యూరిటీ గార్డుపై దాడికి యత్నించాడు.
ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే...జేఎన్‌టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల స్పందన బ్లాక్ ఎదుట వాహనాలు పార్కు చేయకుండా పార్కింగ్ ఏరియాలోనే పార్కు చేసేలా చూడాలన్న ప్రిన్సిపాల్ ఆదేశిస్తూ ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నో పార్కింగ్ ఏరియాలో వాహనాలు నిలుపకుండా సెక్యూరిటీ గార్డు కాశిరాములు విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఫిజిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు తనయుడు తన తల్లి సహా వర్సిటీకి వచ్చి నో పార్కింగ్ ఏరియాలో కారు నిలిపాడు.
దీంతో సెక్యూరిటీ గార్డు కాశీరాం అందుకు అభ్యంతరం చెప్పడంతో తాను ప్రొఫెసర్ కొడుకునని, తనకే అడ్డు చెబుతావా అంటూ వాగ్వాదానికి దిగాడు. అతను వారించినా వినకుండా కారును పార్కుచేసిన ప్రొఫెసర్ తనయుడు లోపలికి వెళ్లి ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. దీంతో కోపంతో ఊగిపోతూ బయటికి వచ్చిన ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు సెక్యూరిటీగార్డును అందరి ముందు బూతులు తిడుతూ మొఖంపై, మెడపై గాయాలయ్యేలా చితకబాదాడు. అంతేగాకుండా ప్రిన్సిపాల్ గదివరకూ కొట్టుకుంటూ తీసుకెళ్లాడు. సిబ్బంది వారించినా పట్టించుకోకుండా తన చెప్పు తీసి కొట్టేందుకు యత్నించాడు. చివరకు సెక్యూరిటీ గార్డు తనను క్షమించాలని, తప్పయిందంటూ వేడుకున్నాడు. తన కొడుకు కాళ్లు పట్టుకుంటే వదిలేస్తానని చెప్పడంతో కాశీరాములు ప్రొఫెసర్ కొడుకు కాళ్లు పట్టుకున్నాడు.
అతను శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడంతో యూనివర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా గతంలోనూ వెంకటేశ్వరరావు సెక్యూరిటీ గార్డులను బూతులు తిట్టినా ఎవరూ పట్టించుకోలేదని, దీంతో మరింత రెచ్చిపోయి ఏకంగా భౌతికదాడులకు దిగుతున్నాడని ఆరోపించారు. ఈ విషయమై జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ యాదయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా సంఘటన తమ దృష్టికి వచ్చిందని, అయితే ప్రిన్సిపాల్ నుంచి నివేదిక వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment