‘రాష్ట్రపతి మేకలను మేపడానికి వెళ్లాడు!’
బుండీ: ‘రాష్ట్రపతి మేకలను మేపడానికి వెళ్లాడు. ప్రధానమంత్రి సరుకులు తీసుకురావడానికి బజారుకు పోయాడు’.... విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన రాజస్తాన్‌లోని బుండీ జిల్లాకు వెళితే మీకు ఇలాంటి మాటలు వినిపించొచ్చు. వాటిని విని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అక్కడ మరింత ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి ఉంది.
అదేంటంటే అత్యున్నత స్థాయి పదవులు, కార్యాలయాలు, ప్రముఖ ఉత్పత్తుల పేర్లే ఈ జిల్లాలోని చాలా మందికి పేర్లుగా ఉంటాయి. కొంతమంది సిమ్‌కార్డు, శామ్సంగ్, ఆండ్రాయిడ్, మిస్‌కాల్, హైకోర్టు తదితరాలను తమ పేర్లుగా పెట్టుకుంటారు. జిల్లా కేంద్రానికి 10 కి.మీ దూరంలో రామ్‌నగర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓసారి జిల్లా కలెక్టర్ పర్యటిస్తుండగా, ఆయన తెలివికి ముగ్దురాలైన ఓ మహిళ తన మనవడికి కలెక్టర్ అని పేరు పెట్టింది. కానీ ఆమె మనవడు ఎప్పుడూ కనీసం పాఠశాలకు వెళ్లి చదువుకోలేదు. అలాగే మరికొంత మందికి ఐజీ, ఎస్పీ, హవాల్దార్, మెజిస్ట్రేట్ లాంటి పేర్లు కూడా ఉంటాయి.