ఓ పిచ్చోడు గాంధీని చంపాడు
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీని ఓ పిచ్చివాడు చంపేశాడని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. గాంధీ సిద్ధాంతం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటుందన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా ‘స్వచ్ఛ్ గంగ- గ్రామీణ్ సహ్‌భాగిత’ పేరిట ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శనివారం ఆమె ప్రసంగించారు. గంగానదీ తీరాన ఉన్న గ్రామ పంచాయతీ పెద్దలంతా గంగానది ప్రక్షాళన కోసం కృషి చేయాలని కోరారు.
భారత ఆత్మ గ్రామాల్లోనే ఉందని గాంధీజీ అన్నారని.. జాతిపిత వర్ధంతి రోజున గంగానది ప్రక్షాళనకు గ్రామాల పెద్దలతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టడం శుభపరిణామమని ఆమె అన్నారు. గంగానది ప్రక్షాళనకు గత 29 ఏళ్లుగా రూ. 4 వేల కోట్లు వ్యయం చేసినా ప్రయోజనం సిద్ధించలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.