గాంధీజిని రక్షించిన బటక్ మియా (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా మంగళవారం నాడు దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనపై కాల్పులు జరిపి హత్య చేసిన నాథూరామ్ గాడ్సే గురించి, ఆయనతోపాటు హత్య కుట్రలో భాగస్వామిగా ఉన్న నారాయణ్ ఆప్టేలను 1949, నవంబర్ 15న ఉరిశిక్ష విధించిన విషయం గురించి అన్ని పత్రికలు ప్రస్తావించాయి. అంతకుముందు 1917లోనే గాంధీపై హత్యాయత్నం జరిగిందని, అప్పుడు గాంధీకి కుట్ర గురించి వెల్లడించి ఆయన ప్రాణాలను రక్షించిన ఓ వంట మనిషి ఎన్నో చిత్ర హింసలకు గురయ్యారని, ఆయన మనమళ్లు ఇప్పటికీ కూలీలుగా బతుకుతున్నారనే విషయాలను కూడా ప్రస్తావిస్తే బాగుండేది.
1917, ఏప్రిల్ 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు బీహార్‌లోని తూర్పు కంపారన్ జిల్లాలోని మోతిహరి రైల్వే స్టేషన్‌లో ముజాఫర్‌బాద్ నుంచి వచ్చిన రైల్లో జాతిపిత గాంధీ దిగారు. అక్కడి భూస్వాములు ఇండిగో(నీలగిరి) చెట్లను పెంచాల్సిందిగా స్థానిక రైతులను వేదిస్తున్నారన్న వార్తలపై వాస్తవాలు తెలుసుకునేందుకు గాంధీ అక్కడికి వెళ్లారు. ‘ఎర్విన్’ అనే ఇండిగో తోటకు మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ బ్రిటిషర్ నుంచి భోజనానికి రావాల్సిందిగా గాంధీకి ఆహ్వానం అందింది (ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత హరీష్ చంద్ర చౌదరి రాసిన ‘చంపారన్‌కే స్వాతంత్రతా సేనాని’ పుస్తకం ప్రకారం).
బ్రిటీష్ మేనేజర్ ఎర్విన్ గాంధీ రాగానే ఆయనకు విషయం కలిపిన పాలను ఇవ్వాల్సిందిగా తన వంటవాడైన బటక్ మియాకు ఆదేశించాడు. చెప్పినట్టు చేస్తే ఎంత డబ్బైనా ఇస్తానని, చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గాంధీ రాగానే బటక్ మియా విషం కలిపిన పాలను తీసుకొచ్చి గాంధీ ముందు నిలబడ్డాడు. అందులో విషం ఉందని, తమను చంపేందుకు తన యజమాని కుట్ర పన్నిన విషయాన్ని బటక్ మియా చెప్పేశాడు. ఆ నాటి ఈ కుట్రకు ప్రత్యక్ష సాక్షి భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆ కుట్ర నుంచి క్షేమంగా బయట పడిన గాంధీజీ రైతుల కష్టాలపై భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక ఘట్టమైన తొలి సత్యాగ్రహం జరిపారు.
వంటవాడు బటక్ మియాది మోతిహరి సమీపంలోని సిస్వా అజ్‌గరీ అనే కుగ్రామం. గాంధీని చంపకుండా కుట్రను బయటపెట్టినందుకు ఆయన కుటుంబాన్ని ఆ గ్రామం నుంచి తరిమేశారు. ఆయన ఇంటి స్థలాన్ని శ్మశానంగా మార్చేశారు. బటక్ మియా కుట్రకు పాల్పడితే గాంధీజీ ఉండేవారు కాదు. ఆయన లేని స్వాతంత్య్ర పోరాటాన్ని ఊహించలేం. అయినప్పటికీ బటక్ మియా విషయాన్ని అందరూ మరచిపోయారు. 1950లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అవిభాజ్య చంపారన్‌కు హెడ్‌క్వాటర్‌గా ఉన్న మోతిహరిని సందర్శించారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ రైలు దిగినప్పుడు ఆయనకు స్వాగతం చెప్పేందుకు రైల్వే గేట్ల నుంచి జనం ఎగబడ్డారు. అందులో ఓ వ్యక్తిగా గట్టిగా మాట్లాడుతూ తనవైపు వచ్చేందుకు ప్రయత్నించడాన్ని రాజేంద్ర ప్రసాద్ గమనించారు.
ఆ వ్యక్తిని బటక్ మియాగా గుర్తించి ఆయన వద్దకు వెళ్లి పలకరించారు. భుజం మీద చేయివేసి వెంట తీసుకెళ్లాడు. పట్టణంలో తన కోసం ఏర్పాటు చేసిన వేదికపైకి కూడా బటక్ మియాను తీసుకెళ్లి తన పక్కనే కూర్చోపెట్టుకున్నారు. ఆయన చేసిన సహాయం ఎలాంటిదో ప్రజలకు చెప్పారు. చంపారన్ కలెక్టర్‌ను పిలిచి బటక్ మియా, ఆయన ముగ్గురు కుమారులకు 24 ఎకరాల భూమిని ఇచ్చి జాతి పురస్కారాన్ని అందజేయాలని ఆదేశించారు. అక్కడ గాంధీ సత్యాగ్రహం జరిగి వందేళ్లు అయింది. ఇప్పటికీ బటక్ మియా ముని మనవళ్లు ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలవుతుందా ? అని ఎదురుచూస్తున్నారు.
2010లో బటక్ మియా కుటుంబం ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితుల గురించి ‘హిందుస్థాన్ టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచురించింది. దానిపై అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ స్పందించి నాడు రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన హామీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ ఓ నివేదికను సమర్పించాల్సిందిగా తూర్పు, పశ్చిమ చంపారన్ మేజిస్ట్రేట్లను ఆదేశించారు. వారు ఎలాంటి నివేదిక ఇచ్చారో, అసలు నివేదిక ఇచ్చారో లేదో తెలియదు. గాంధీ వర్థంతి రోజున కూడా సిస్వా అజ్‌గరి గ్రామంలో బటక్ మియా దంపతుల సమాధులు దుమ్ముకొట్టుకుపోయి ఉన్నట్లు స్థానిక పత్రికల ద్వారా తెలిసింది. వారు మనమళ్లు అక్కడి ‘టైగర్ రిజర్వ్ ఫారెస్ట్’ సమీపంలో ఉన్న ఓ చిన్న స్థలంలో కూలినాలి చేసుకుంటూ బతుకుతున్నారట. హామీలు ఇవ్వడం మరచిపోవడం స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు మన ప్రభుత్వాలకు అలవాట్లని ఈ వార్తా కథనం స్పష్టం చేస్తోంది. ఎవరో కళాకారుడు గీసిన బటక్ మియా చిత్తరువు తప్ప ఆయన ఫొటో కూడా అందుబాటులో లేదు.
Comments
Please login to add a commentAdd a comment