
గీత తల్లిదండ్రుల నిర్ధారణకు డీఎన్‌ఏ టెస్ట్
గీత తమ అమ్మాయే అంటున్న దంపతులకు అధికారులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు.
⇒ డీఎన్‌ఏ నమూనాలు ఇచ్చిన కొత్తగూడెం దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ నుంచి వచ్చిన భారతీయ యువతి గీత తమ అమ్మాయే అంటున్న కొత్తగూడెం దంపతులకు విదేశాంగ మంత్రిత్వ అధికారులు మంగళవారం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. పదేళ్ల వయసులో తమ అమ్మాయి రాణి తప్పిపోయిందని, పాకిస్తాన్ నుంచి వచ్చిన గీత తమ అమ్మాయేనని కిష్టయ్య, గోపమ్మ దంపతులు పేర్కొంటున్న విషయం తెలిసిందే. గీత తమ అమ్మాయేనని చెప్పుకుంటున్న నలుగురు దంపతులకు వైద్యులు ఇప్పటికే డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా.. గీత డీఎన్‌ఏతో ఎవరిది సరిపోలేదు.
దీంతో గీతకు భోపాల్‌లోని ఒక సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం కల్పించిన విషయం తెలిసిందే. అయితే గీత తమ అమ్మాయేనని.. పోలికలు చాలా ఉన్నాయని కిష్టయ్య, గోపమ్మ దంపతులు మీడియాతో పేర్కొన్నారు. డీఎన్‌ఏ ఫలితాలు రావడానికి మూడు వారాల సమయం పడుతుందని విదేశాంగ మంత్రిత్వ అధికారులు చెప్పారన్నారు. 2006లో గుంటూరులో జరిగిన క్రైస్తవ మహాసభలకు హాజరైనప్పుడు తమ అమ్మాయి తప్పిపోయిందని, అప్పట్లో పత్రికల్లోనూ వార్తలు వచ్చాయన్నారు. గీత చెప్పిన ఆనవాళ్లు కూడా తమ ఇంటి వద్ద ఉన్నాయని గోపమ్మ తెలిపింది.