వినోదం కోసం ఎమర్జెన్సీ తలుపు తీశాడు!!
ముంబై: జెట్ ఎయిర్‌వేస్ విమానాయాన సంస్థకు ప్రయాణికుల నుంచి చిత్రమైన చిక్కులు ఎదురవుతున్నాయి. విచిత్రమైన కారణాలతో ఇద్దరు ప్రయాణికులు విమానంలో నిబంధనలు ఉల్లంఘించడంతో వారిపై జెట్ ఎయిర్‌వేస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జర్మనీకి చెందిన స్టీవ్ టిట్‌ష్లెర్ ఆదివారం అబుధాబి నుంచి జెట్ ఎయిర్‌వేస్ (9 డబ్యూ 585) విమానం ఎక్కి ముంబై వచ్చాడు. ముంబై విమానాశ్రయంలో విమానం పార్క్ చేసి ఉండగా అతడు ఉన్నట్టుండి ఎమర్జెన్సీ తలుపు తీశాడు. దీనిని చూసి ఆందోళన చెందిన విమాన సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎందుకు తలుపు తీశావని ఆయనను అడిగారు. స్టీవ్ చెప్పిన సమాధానం విని వారు బిత్తరపోయారు. కేవలం వినోదం కోసం తాను ఎమర్జెన్సీ తలుపు తీసినట్టు ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) ఆయనను అరెస్టుచేసి సహర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. జెట్ ఎయిర్‌వేస్‌లో ఆయన ఢిల్లీలోకి వెళ్లాల్సి ఉన్నా అందుకు అనుమతించలేదు. ఆయనపై విమానాయాన చట్టం 1937లోని సెక్షన్ 29, ఐపీసీ సెక్షన్ 336 ప్రకారం కేసు నమోదుచేశారు.
వాష్‌రూమ్‌లో స్మోకింగ్!
రవి ధాంకర్ ఆదివారం సింగపూర్ నుంచి ముంబై వచ్చాడు. జెట్ ఎయిర్‌వేస్ (9డబ్ల్యూ 09) విమానంలో వచ్చిన అతను విమానంలోని వాష్‌రూమ్‌లో సిగరెట్ తాగుతూ దొరికిపోయాడు. ఆయన బాగా మద్యం మత్తులో ఉన్నట్టు కనిపించాడని, విమానం బాత్‌రూమ్ వద్ద అతను పొగ తాగుతుండగా సహచర ప్రయాణికులు గుర్తించి సిబ్బందికి తెలిపారని విమానాయాన సంస్థ అధికారులు తెలిపారు. విమానం ముంబైలో దిగగానే అతనిని సహర్ పోలీసు స్టేషన్‌కు తరలించి.. కేసులు నమోదుచేశారు.