6 నెలలు అత్యాచారం.. ప్రాణాలతో పోరాటం
దేశ రాజధానిలో కూడా అమ్మాయిలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. 18 ఏళ్ల యువతిపై పలువురు వ్యక్తులు ఆరు నెలల పాటు అత్యాచారం చేస్తూ ఉండటంతో ఆమె ఇప్పుడు ప్రాణాల కోసం ఆస్పత్రిలో పోరాడుతోంది. ఆమె తన బంధువని చెబుతూ ఓ వ్యక్తి ఈ బాధితురాలిని ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ ఆస్పత్రిలో చేర్చాడు. కానీ, చేర్చిన తర్వాత వెంటనే వెళ్లిపోయాడు. కనీసం కాళ్ల మీద నిలబడే పరిస్థితిలో కూడా ఆమె లేకపోవడంతో.. బాధితురాలిని చూసి వైద్యులు నిర్ఘాంతపోయారు. ఆమెపై పదే పదే అత్యాచారాలు జరగడం వల్లే ఆమె తీవ్రంగా గాయపడిందని చెబుతున్నారు. గత సంవత్సరం ఆమెను పశ్చిమబెంగాల్ నుంచి తీసుకొచ్చారని, తర్వాత రిషికేశ్, హరిద్వార్, మనాలి, మంగళూరు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెపై పలువురు వ్యక్తులు అత్యాచారం చేశారని తెలిసింది.
ఈమె జాడ తెలుసుకోడానికి ఏప్రిల్ నెల నుంచి శక్తివాహిని అనే స్వచ్ఛంద సంస్థ ప్రయత్నించింది కానీ, కోల్‌కతా పోలీసుల ద్వారా ఆమె వివరాలు సోమవారమే తెలిశాయి. ఆమెను ఈ స్థితికి తీసుకొచ్చిన వ్యక్తిని గుర్తించడంలో శక్తివాహిని సంస్థ కోల్‌కతా పోలీసులకు సాయపడింది. ఆమెను ఆస్పత్రికి తెచ్చిన వ్యక్తి వివరాలు తెలుసుకోడానికి ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజి పరిశీలించాలని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు.