shakti vahini
-
వాళ్ల పెళ్లి వాళ్లిష్టం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: చట్టబద్ధ వయసు వచ్చిన తరువాత కుల, మతాలకు అతీతంగా వివాహం చేసుకున్న జంట జీవితంలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే బంధువులు, కుటుంబ సభ్యులు వారిపై హింసకు పాల్పడొద్దని, వేధించొద్దని, బెదిరించొద్దని స్పష్టం చేసింది. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ ముప్పు ఉందని భయపడే జంటలకు రాష్ట్ర ప్రభుత్వాలే రక్షణ కల్పించాలని కేంద్రం కోర్టుకు తెలిపింది. పరువు హత్యల నుంచి యువ జంటలను రక్షించాలని కోరుతూ 2010లో శక్తి వాహిని అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సవివర తీర్పును వెలువరిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ బుధవారం పేర్కొంది. ఖాప్ పంచాయతీలను గుర్తించబోమన్న ధర్మాసనం..వాటిని కేవలం కమ్యూనిటీ బృందాలుగానే పరిగణిస్తామని తెలిపింది. ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ స్పందిస్తూ..బంధువులు, ఖాప్ పంచాయతీ పెద్దల నుంచి తమకు ముప్పు ఉందని జంట భావిస్తే వివాహ నమోదు సమయంలోనే ఆ విషయాన్ని సదరు అధికారికి తెలియజేయాలని అన్నారు. -
ఆ హక్కు మీకు లేదు!
న్యూఢిల్లీ: సమాజంలో నైతికతను కాపాడటమే తమ బాధ్యతనే విధంగా ఖాప్ పంచాయతీలు వ్యవహరించ కూడదని సుప్రీం కోర్టు మండిపడింది. ఇద్దరు మేజర్ల వివాహాన్ని చట్టమే నిర్ధారిస్తుందని పేర్కొంది. వివాహాల విషయంలో ఖాప్ పంచాయతీల జోక్యంపై విచారించేందుకు సీనియర్ పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. ‘ఓ పెళ్లి సరైనదా? కాదా? అనే అంశాన్ని చట్టమే నిర్ణయిస్తుంది. తదనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. కానీ మీరు (ఖాప్ పంచాయతీలు) సమాజంలో నైతికతను కాపాడాల్సిన పనిలేదు’ అని ధర్మాసనం పేర్కొంది. పరువు హత్యలపై ‘శక్తి వాహిని’ అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఖాప్‌లు కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నాయి. అయితే.. హిందూ వివాహ చట్టం ప్రకారం ఒకే కుటుంబానికి (సపిండ) చెందిన వారు పెళ్లిచేసుకోకూడదు. సమాజంలో నైతిక విలువలను కాపాడేలా ఖాప్ పంచాయతీలు పనిచేస్తున్నాయి’ అని ఖాప్ పంచాయతీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొవద్దు: దీనిపై సుప్రీం స్పందిస్తూ.. ‘ఇద్దరు యువతీ యువకుల మధ్య పెళ్లి వారి వ్యక్తిగతం. దీనిపై చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకోకూడదు. ఈ విషయాలపై ఖాప్‌కు ఎలాంటి సంబంధం ఉండదు’ అని పేర్కొంది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. 796 శాతం పెరిగిన పరువు హత్యలు! 2014–15లో పరువు హత్యలు దేశవ్యాప్తంగా 796 శాతం పెరిగాయి. 2014లో 28 పరువుహత్యల ఘటనలు చోటుచేసుకోగా.. 2015లో ఈ సంఖ్య 251కి పెరిగింది. ఈ జాబితాలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు నాలుగైదు స్థానాల్లో ఉన్నాయని జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించింది. పది పదిహేను మంది సభ్యులుండే ఖాప్ పంచాయతీలు కోర్టులకు చేరని తమ సామాజికవర్గానికి చెందిన గొడవలను విచారణ ద్వారా పరిష్కరిస్తాయి. -
6 నెలలు అత్యాచారం.. ప్రాణాలతో పోరాటం
దేశ రాజధానిలో కూడా అమ్మాయిలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. 18 ఏళ్ల యువతిపై పలువురు వ్యక్తులు ఆరు నెలల పాటు అత్యాచారం చేస్తూ ఉండటంతో ఆమె ఇప్పుడు ప్రాణాల కోసం ఆస్పత్రిలో పోరాడుతోంది. ఆమె తన బంధువని చెబుతూ ఓ వ్యక్తి ఈ బాధితురాలిని ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ ఆస్పత్రిలో చేర్చాడు. కానీ, చేర్చిన తర్వాత వెంటనే వెళ్లిపోయాడు. కనీసం కాళ్ల మీద నిలబడే పరిస్థితిలో కూడా ఆమె లేకపోవడంతో.. బాధితురాలిని చూసి వైద్యులు నిర్ఘాంతపోయారు. ఆమెపై పదే పదే అత్యాచారాలు జరగడం వల్లే ఆమె తీవ్రంగా గాయపడిందని చెబుతున్నారు. గత సంవత్సరం ఆమెను పశ్చిమబెంగాల్ నుంచి తీసుకొచ్చారని, తర్వాత రిషికేశ్, హరిద్వార్, మనాలి, మంగళూరు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెపై పలువురు వ్యక్తులు అత్యాచారం చేశారని తెలిసింది. ఈమె జాడ తెలుసుకోడానికి ఏప్రిల్ నెల నుంచి శక్తివాహిని అనే స్వచ్ఛంద సంస్థ ప్రయత్నించింది కానీ, కోల్‌కతా పోలీసుల ద్వారా ఆమె వివరాలు సోమవారమే తెలిశాయి. ఆమెను ఈ స్థితికి తీసుకొచ్చిన వ్యక్తిని గుర్తించడంలో శక్తివాహిని సంస్థ కోల్‌కతా పోలీసులకు సాయపడింది. ఆమెను ఆస్పత్రికి తెచ్చిన వ్యక్తి వివరాలు తెలుసుకోడానికి ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజి పరిశీలించాలని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు.