న్యూఢిల్లీ: చట్టబద్ధ వయసు వచ్చిన తరువాత కుల, మతాలకు అతీతంగా వివాహం చేసుకున్న జంట జీవితంలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే బంధువులు, కుటుంబ సభ్యులు వారిపై హింసకు పాల్పడొద్దని, వేధించొద్దని, బెదిరించొద్దని స్పష్టం చేసింది. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ ముప్పు ఉందని భయపడే జంటలకు రాష్ట్ర ప్రభుత్వాలే రక్షణ కల్పించాలని కేంద్రం కోర్టుకు తెలిపింది.
పరువు హత్యల నుంచి యువ జంటలను రక్షించాలని కోరుతూ 2010లో శక్తి వాహిని అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సవివర తీర్పును వెలువరిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ బుధవారం పేర్కొంది. ఖాప్ పంచాయతీలను గుర్తించబోమన్న ధర్మాసనం..వాటిని కేవలం కమ్యూనిటీ బృందాలుగానే పరిగణిస్తామని తెలిపింది. ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ స్పందిస్తూ..బంధువులు, ఖాప్ పంచాయతీ పెద్దల నుంచి తమకు ముప్పు ఉందని జంట భావిస్తే వివాహ నమోదు సమయంలోనే ఆ విషయాన్ని సదరు అధికారికి తెలియజేయాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment