ఆ పన్నెండు మంది ఎవరు..?
- నీలగిరుల్లో పోస్టర్లు
- రైల్వే ట్రాక్ పై పేలుడు
అటవీ గ్రామాల్లో ఎన్నికల్ని బహిష్కరిద్దామన్న నినాదాలతో పోస్టర్లు వెలిసి ఉండడం పోలీసు యంత్రాంగానికి షాక్ ఇచ్చేలా చేసింది. పన్నెండు మంది తుపాకులతో తమ ప్రాంతాల్లో పర్యటిస్తూ, ఎన్నికల్ని బహిష్కరించాలని ఒత్తిడి తెస్తున్నట్టుగా నీలగిరుల్లోని పలు గ్రామాల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో అప్రమత్తం అయ్యారు. ఆ పన్నెండు మంది ఎవరు అన్న ప్రశ్న బయలు దేరిన సమయంలో ధర్మపురి సమీపంలో రైల్వేట్రాక్‌పై బాంబు పేలుడు జరగడం ఉత్కంఠను రేపుతోంది.
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఇటీవల కాలంగా మావోయిస్టుల కార్యకలాపాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నట్టున్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా తమిళనాడు - కేరళ సరిహద్దుల్లో ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో వీరి కదలికల మీద సమాచారాలు పెరుగుతున్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక సంయుక్తంగా కూంబింగ్ సాగిస్తున్నా, జాడ మాత్రం కాన రాలేదు. అయితే, ఇటీవల నీలగిరుల్లోని దట్టమైన అడవుల్లో కాల్పులు సైతం జరగడం, గాయపడ్డ వాళ్లు ఏమయ్యారో అన్న ఆచూకీ ఇంత వరకు చిక్కలేదు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు చాప కింద నీరులా వ్యూహ రచనలు చేసి ఒక్కసారిగా తమ ఉనికి చాటుకునేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ప్రస్తుతం కొన్ని సంఘటనలు వెలుగులోకి రావడంతో పోలీసు యంత్రాంగం షాక్‌కు గురి కాక తప్పలేదు. ఓ వైపు కూంబింగ్ సాగుతున్నా, మరో వైపు మావోయిస్టులు తరచూ కొన్ని గ్రామాల్లో ప్రత్యక్షం అవుతున్నట్టు సమాచారాలు వస్తుండడంతో క్యూబ్రాంచ్ వర్గాలు డైలమాలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో గత రెండు మూడు రోజులుగా నీలగిరి జిల్లాల్లోని అటవీ గ్రామాల్లో పన్నెండు మంది తుపాకులతో సంచరిస్తున్నట్టుగా వచ్చిన సంకేతాలతో మరింత అప్రమత్తం అయ్యారు.
పోస్టర్లు సరే.. వాళ్లెక్కడ
నీలగిరుల్లో అటవీ గ్రామాల సంఖ్య ఎక్కువే. కేరళ- తమిళనాడును అనుకుని ఉండే గ్రామాల్లో అయితే, ఎవర్నీ గుర్తు పెట్టడం కూడా వీలు పడదు. అలాంటి వాతావరణం, పరిస్థితులు అక్కడ ఉంటాయి. కొన్ని చోట్లకు ఈవీఎంలు తరలించాలంటే మరీ కష్టమే. ఇలాంటి ప్రాంతాల్లోని ప్రజల్ని ఎన్నికల బహిష్కరణ పిలుపుతో, వారి హక్కుల్ని గుర్తు చేస్తూ, పన్నెండు మందితో కూడిన బృందం సంచరిస్తున్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి.
ఈ పన్నెండు మంది తుపాకులతో గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ఎన్నికల్ని బహిష్కరిద్దామని, మన భూమి, మన అడవులు, మన జీవనం అన్న బోధనల్ని వల్లిస్తూ వస్తున్నట్టు సమాచారం. శనివారం రాత్రి ఈ బృందం కోల కొంబై గ్రామాల్లో సంచరించడమే కాకుండా, అక్కడడక్కడ కరపత్రాలు వదలి వెళ్లడం, కొన్ని చోట్ల ఏకంగా పోస్టర్లను అంటించి ఉంది. కోల కొంబైలో మావోయిస్టులు ఉన్న సమాచారంతో కూంబింగ్‌లో ఉన్న క్యూబ్రాంచ్ వర్గాలు అక్కడికి ఉరకలు తీశారు. అయితే, అప్పటికే ఆ పన్నెండు మంది పత్తా లేకుండా పోగా, పోస్టర్లు కరపత్రాలను మాత్రం వదలి వెళ్లడంతో వాళ్లెక్కడ అన్న అన్వేషణను క్యూబ్రాంచ్ తీవ్రతరం చేసింది. సీపీఐ మావోయిస్టు అంటూ ప్రచురించిన ఆ పోస్టర్లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఇక, ఒకప్పుడు ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో మావోయిస్టుల సంచారం అధికంగా ఉన్న విషయం తెలిసిందే.
రైల్వే ట్రాక్ పేలుడు
ఆదివారం ధర్మపురి సమీపంలోని మరప్పూర్ రైల్వే స్టేషన్‌కు మూడు కి.మీ దూరంలో రైల్వేట్రాక్‌పై పేలుడు శబ్దం రావడంతో ఆ జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ధర్మపురి జిల్లా ఎస్పీ లోకనాథన్ నేతృత్వంలోని బృందం అక్కడికి పరుగులు తీసింది.రైల్వేట్రాక్ వద్ద కండెన్సర్లు, విద్యుత్ మోటార్‌కు ఉపయోగించే పరికరాలు, వైర్లు లభించడంతో, ఒకప్పుడు మావోయిస్టులు పేలుళ్లకు ఇలాంటి వాటినే ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా, గతంలో అజ్ఞాతంలోకి వెళ్లిన మావోయిస్టులు మళ్లీ చొరబడ్డారా..? అన్న ప్రశ్న బయలు దేరింది. రైలుబోల్తా కుట్ర లక్ష్యంగా వీటిని అమర్చి ఉండొచ్చన్న అనుమానంతో దర్యాప్తును వేగవంతం చేసి ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల నినాదం తెర మీదకు వస్తుండడంతో అటవీ గ్రామాల్లో ఎన్నికల భద్రత కట్టుదిట్టపై దృష్టి పెట్టేందుకు ఈసీ సమాయత్తం అవుతోంది.