మావోయిస్టుల విధ్వంసం | Maoist violence | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల విధ్వంసం

Published Thu, May 8 2014 1:45 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

మావోయిస్టుల విధ్వంసం - Sakshi

మావోయిస్టుల విధ్వంసం

  •      పలకజీడిలో పోలింగ్ బూత్ స్వాధీనం
  •      ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి, జీపు దహనం
  •      బెంబేలెత్తిపోయిన పోలింగ్ సిబ్బంది
  •      రీపోలింగ్ ఎన్నికల కమిషన్ ఆదేశం
  •  కొయ్యూరు, న్యూస్‌లైన్: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో పోలీసులు గట్టి భద్రత చేపట్టినప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో మావోయిస్టులు ఉనికిని చాటుకున్నారు. పోలింగ్ కేంద్రంపై దాడిచేసి విధ్వంసానికి పాల్పడ్డారు. 2004లో మాదిరి మరోసారి పోలింగ్‌కు అంతరాయం కల్పించారు. కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ పలక జీడి పోలింగ్ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం రెండు ఈవీఎంలు, సిబ్బందిని తీసుకువచ్చిన జీపును కాల్చివేశారు.

    ఇక్కడ రీపొలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించినట్టు తెలిసింది.  ప్రత్యక్షసాక్షుల సమాచారం మేరకు మధ్యాహ్నం 12.30 గంటలకు  మావోయిస్టు నేత ఆజాద్ ఆధ్వర్యంలో వచ్చిన దళసభ్యులు పోలింగ్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సామగ్రి, రెండు ఈవీఎంలు, వాటి కనెక్టర్లు, రెండు రిజర్వు ఈవీఎంలతో పాటు  ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని తరలించేందుకు అద్దెకు తెచ్చిన ఒక జీపును తగులబెట్టారు. జీపు డ్రైవర్ బతిమాలినప్పటికీ దళసభ్యులు పట్టించుకోలేదు.

    ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో 1300 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఘటన జరిగేటప్పటికి సుమారు 450 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల సిబ్బంది జోలికి రాని మావోయిస్టులు పోలింగ్ కేంద్రం అధికారి ఆర్.ఇరుకులుకు ఓ లేఖ ఇచ్చి, ఉన్నతాధికారులకు, మీడియాకు అందజేయమన్నారు. ఎన్నికల బహిష్కరణకు తాము పిలుపు ఇస్తున్నా, ప్రజలకు అన్ని సౌకర్యాలూ రద్దు చేస్తామని బెదిరించి, నాటకీయంగా ఎన్నికలను జరిపిస్తున్నారని లేఖలో ఆరోపించారు.

    ఉద్యోగ భద్రత పేరుతో పోలింగ్ సిబ్బందినీ  బెదిరించి,ఎన్నికలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. గాలికొండ ఏరియా మావోయిస్టు కమిటీగాా చెప్పుకొన్న ఈ బృందంలోని ఏడుగురు మావోయిస్టుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. పలకజీడి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో మావోయిస్టులు సునాయాసంగా గ్రామంలో ప్రవేశించి విధ్వంసానికి పాల్పడగలిగారు. మావోయిస్టులు వెళ్లిపోయిన అనంతరం పోలింగ్ సిబ్బంది కాలినడకన తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం చేరుకున్నారు.
     
    పోలింగ్ సిబ్బంది బెంబేలు

    సాయుధ మావోయిస్టులను చూడగానే పోలింగ్ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. మీరెందుకు పోలింగ్‌కు వచ్చారంటూ మావోయిస్టు నాయకుడు ఆజాద్ ఉపాధ్యాయులను ప్రశ్నించినట్టు తెలిసింది. విధులకు హాజరుకాకుంటే అధికారులు సస్పెండ్ చేస్తారని వారు సమాధానమిచ్చారు. దానికి ఆయన బదులిస్తూ సస్పెన్షన్ లేదా ఉద్యోగాల నుంచి తొలగించడం జరగదని, మహా అయితే ఇంక్రిమెంట్లు కట్ చేస్తారని చెప్పినట్టు తెలిసింది. దాని కోసం ఇంత  దూరం సాహసం చేసి రావడం వృథాఅని చెప్పినట్టు సమాచారం.  

    పోలీసులు లేకపోవడం వల్లే...
     
    పోలింగ్ కేంద్రం వద్ద ఒక్క పోలీసు లేకపోవడాన్ని మావోయిస్టులు ఆసరాగా తీసుకున్నారన్న వాదన వ్యక్తమవుతోంది. రేవులకోట పోలింగ్ కేంద్రంపై దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో అంతా అక్కడ మోహరించారు. పోలీసుల కదలికలపై పూర్తి సమాచారం ఉన్న దళసభ్యులు ఇదే అదనుగా పలకజీడిలో విధ్వంసానికి పాల్పడ్డారు. కిందటి నెలలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కూడా కొందరు మావోయిస్టులు సివిల్ డ్రస్‌లో ఈ కేంద్రం వద్దకు వచ్చారు. అప్పట్లో పోలీసులు ఉండడంతో తిరిగి వె ళ్లిపోయారు. 2004 ఎన్నికల్లోనూ ఇదే కేంద్రం వద్ద  పోలింగ్ సిబ్బందిని తీసుకువచ్చిన జీపును,ఎన్నికల సామగ్రిని మావోయిస్టులు కాల్చివేసిన విషయం తెలిసిందే.  
     
    రెండు వాహనాల్లో సిబ్బంది తరలింపు
     
    పలకజీడి నుంచి పోలింగ్ సిబ్బందిని రెండు వాహనాల్లో కొయ్యూరు తీసుకొస్తున్నారు. ఇందుకుపాడేరు ఆర్వో రాజకుమారి కొయ్యూరు తహశీల్దారు ఉమామహేశ్వరరావును బుధవారం సాయంత్రం పంపారు. సిబ్బంది మెయిన్‌రోడ్డులోని పనసలపాలెం రావాలంటే 14 కిలోమీటర్ల దూరం నడవాలి. అక్కడి నుంచి వాహన సదుపాయం ఉంటుంది.

    ఈ పోలింగ్ కేంద్రానికి హౌసింగ్ ఏఈ రామలింగస్వామి సెక్టార్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆయన నుంచి తొలి సమాచారం లేకపోవడంతో కంగారు పడిన అధికారులు ఎకాయెకిన పలకజీడి వెళ్లారు. మావోయిస్టుల విధ్వంసం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దళసభ్యులు ఎటువైపు వెళ్లింది ఆరా తీస్తున్నారు. కూంబింగ్ ఉధృతం చేశారు. ఈ ప్రాంతానికి విశాఖ పోలీసులతోపాటు తూర్పుగోదావరి పోలీసులను పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement