![Goa court frames charges against Tarun Tejpal in rape case - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/29/tej.jpg.webp?itok=CuT7_3wo)
పణజీ: తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్(54)కు గోవాలోని మపుస జిల్లా కోర్టు షాకిచ్చింది. 2013లో తోటి మహిళా జర్నలిస్ట్‌పై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 354ఏ (లైంగిక వేధింపులు) 354బీ (మహిళను వివస్త్ర చేయడం), 341, 342 (కుట్రపూరితంగా నిర్బంధించడం) తదితర ఆరోపణల్ని నమోదు చేసింది.
తనపై నమోదైన అభియోగాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం గోవాలోని బాంబే హైకోర్టు బెంచ్ ముందు ఉన్నందున ప్రస్తుతం విచారణను నిలిపివేయాలని తేజ్‌పాల్ చేసిన విజ్ఞప్తిని అదనపు సెషన్స్ జడ్జి విజయా పొల్ తిరస్కరించారు. తదుపరి విచారణను నవంబర్ 1కి వాయిదా వేశారు. ఈ విషయమై పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు రుజువైతే తేజ్‌పాల్‌కు కనీసం పదేళ్ల జైలుశిక్ష పడుతుందన్నారు.