Tarun Tej Paul
-
ఏడున్నరేళ్ల పోరాటం: తరుణ్ తేజ్‌పాల్ నిర్దోషి
పనాజీ: అత్యాచారం కేసులో తెహల్క మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ నిర్దోషిగా బయటపడ్డాడు. అతడు నిర్దోషి అని గోవా కోర్టు తేల్చి చెప్పింది. 2013లో థింక్ ఇన్ గోవా సమావేశంలో తనను తరుణ్ తేజ్‌పాల్ లైంగికంగా వేధించాడంటూ ‘తెహల్క.కమ్’కు చెందిన మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ మొదలుపెట్టిన పోలీసులు అదే ఏడాది నవంబర్ 30వ తేదీన అరెస్ట్ చేశారు. దీనిపై గోవా కోర్టు విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలపై తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తప్పుడు ఆరోపణలని, ఈ కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. బెయిల్ కోసం కూడా విజ్ఞప్తి చేశారు. విచారణ చేసి 2014 జూలై 1వ తేదీన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదనంతరం తనపై ఆరోపణలను కొట్టివేయాలని.. కేసు రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో గోవా కోర్టులో విచారణ జరిగి చివరకు 2021 మే 21 శుక్రవారం నాడు తీర్పు వెలువడింది. తరుణ్ తేజ్‌పాల్ నిర్దోషి అని పేర్కొంటూ పేర్కొంది. ఏడున్నరేళ్ల తర్వాత తీర్పు వెలువడడంతో తేజ్‌పాల్ కుమార్తె కారా తేజ్‌పాల్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తన న్యాయవాది దివంగత రాజీవ్ గోమొస్‌కు తేజ్‌పాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఇటీవల కరోనాతో మృతిచెందాడు. -
తప్పు చేయనప్పుడు క్షమాపణలెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా సంచలన కథనాలను వెలుగులోకి తెచ్చిన తెహెల్కా మేగజైన్ వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్పాల్పై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసుల విచారణ చేపట్టిన సుప్రీం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. జస్టిస్ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట తేజ్‌పాల్ తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ‘నా క్లయింట్ సీనియర్ జర్నలిస్టు అయినందుకే అతన్ని లక్ష్యంగా చేసుకుని నిరాధార లైంగిక ఆరోపణలు చేశారు’అని వాదించారు. ‘హోటల్ లాబీలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించండి. బాధితురాలు చెప్పిన దాంట్లో ఒక్క వాస్తవం కూడా లేదు. లిఫ్ట్‌లో వేధింపులకు గురిచేశారంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. తేజ్‌పాల్, సదరు జర్నలిస్టుపై మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్‌ను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారు. జరిగిన సంఘటనను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆరోపణలు తప్పు అని రుజువు అవుతాయి’ అన్నారు. వికాస్ సింగ్ ఆరోపణల్ని గోవా పోలీసుల తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఖండించారు. ఆయన చేస్తున్న ఆరోపణలు విచారణ అనర్హమన్నారు. వాద ప్రతివాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పును రిజర్వులో ఉంచింది. అంతకు ముందు సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక ఆరోపణలు నిరాధారమే అయితే తేజ్‌పాల్ బాధితురాలికి ఎందుకు క్షమాపణలు చెప్పాడని ప్రశ్నించింది. ‘ఏమీ జరగకపోతే, మీరు క్షమాపణలు చెప్పేవారు కాదు. ఆరు సంవత్సరాల కిత్రం జరిగిన ఘటనపై క్షమాపణలు కోరుతూ ఇప్పుడు లేఖ పంపించారు. దానికి కారణాలేంటో తెలియాలి. ఈ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది’అని కోర్టు అభిప్రాయపడింది. కేసు పూర్వపరాలు.. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్లో తెహెల్కా మేగజైన్ వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి యత్నించాడని అదే సంస్థలో పనిచేసే ఓ మహిళా జర్నలిస్టు ఆరోపించింది. 2013లో వెలుగుచూసిన ఈ ఘటన అప్పట్లో సంచలన రేకెత్తించింది. హోటల్ లిఫ్టులోకి లాగి తేజ్‌పాల్ లైంగికంగా వేదింపులకు గురిచేశాడని బాధితురాలు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురీకి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఎడిటర్ పదవికి ఆరునెలలపాటు దూరంగా ఉండనున్నట్లు తేజ్‌పాల్ షోమాకు ఈ-మెయిల్ పంపారు. అయితే తన చర్యపట్ల విచారం వ్యక్తం చేస్తూ బాధితురాలికి తేజ్‌పాల్ బేషరతుగా క్షమాపణ చెప్పాడని, దీనిపై బాధితురాలు సంతృప్తి వ్యక్తం చేసిందంటూ షోమా మీడియాకు చెప్పారు. బాధితురాలి కోరుకున్న న్యాయంకన్నా ఆయన ఎక్కువే చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనను సంస్థ అంతర్గత వ్యవహారంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. షోమా వ్యాఖ్యలపై ఎడిటర్స్ గిల్డ్ సహా జర్నలిస్టు సంఘాలు అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తేజ్పాల్ను పోలీసులు అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేయడమేగాక ఘటనపై గోవాలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. గోవాలోనే ఉండి విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. దీంతో తనని అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. 2001లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ లక్ష రూపాయలు ముడుపులు తీసుకోవడాన్ని తేజ్‌పాల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టడం దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
తేజ్పాల్పై రేప్ అభియోగాల నమోదు
పణజీ: తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్(54)కు గోవాలోని మపుస జిల్లా కోర్టు షాకిచ్చింది. 2013లో తోటి మహిళా జర్నలిస్ట్‌పై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 354ఏ (లైంగిక వేధింపులు) 354బీ (మహిళను వివస్త్ర చేయడం), 341, 342 (కుట్రపూరితంగా నిర్బంధించడం) తదితర ఆరోపణల్ని నమోదు చేసింది. తనపై నమోదైన అభియోగాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం గోవాలోని బాంబే హైకోర్టు బెంచ్ ముందు ఉన్నందున ప్రస్తుతం విచారణను నిలిపివేయాలని తేజ్‌పాల్ చేసిన విజ్ఞప్తిని అదనపు సెషన్స్ జడ్జి విజయా పొల్ తిరస్కరించారు. తదుపరి విచారణను నవంబర్ 1కి వాయిదా వేశారు. ఈ విషయమై పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు రుజువైతే తేజ్‌పాల్‌కు కనీసం పదేళ్ల జైలుశిక్ష పడుతుందన్నారు. -
ఏ క్షణంలోనైనా తేజ్పాల్ను అరెస్ట్ చేసే అవకాశం
న్యూఢిల్లీ: తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ కేసు విషయంలో గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు ఢిల్లీ చేరుకున్నారు. ముగ్గురు సభ్యుల పోలీసుల బృందం తెహల్కా ఆఫీసుకు చేరుకుంది. తరణ్ తేజ్ పాల్, తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదరి మధ్య ఉత్తరప్రత్యుత్తరాలను పరిశీలిస్తున్నారు. ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్, ఐప్యాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏ క్షణంలోలైనా తరణ్ తేజ్ పాల్‌ను గోవా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. గోవా ముఖ్యమంత్రి పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఘటనపై విచారణ ప్రారంభించారు. లైంగికదాడి జరిపి పత్రిక ఎడిటర్‌గా ఆరునెలలు తప్పుకోవడమే శిక్షగా పరిగణించాలంటే కుదరదని ఇప్పటికే రాజకీయ పక్షాలు స్పష్టం చేశాయి. తేజ్పాల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, లైంగిక వేధింపుల ఆరోపణలపై తరుణ్ తేజ్పాల్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ క్షణమైనా అతనిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.