గోవా పర్యాటకులకు చేదు వార్త
సాక్షి, గోవా: చాలా మంది చాలాసార్లు గోవాకు వెళ్లాలని అనుకొని ఉంటారు. ఎంజాయ్ చేయడానికి, సరదగా, జాలీ ట్రిప్‌గా గోవానే ఎక్కువ మంది ఎంచుకుంటారు. ఇంక యువత సంగతి అయితే సరేసరి. బీచ్‌లో రెండు పెగ్‌లు వేసి సరదాగా తిరగాలి అనుకుంటారు. చాలా మంది వెళ్లేది కూడా బీచ్ లు చూడ్డానికి, నాలుగు గుక్కలు ముందు వేసుకోవడానికే. అందుకే సెలవులొస్తే చాలా మంది గోవా వెళ్లాలనుకుంటారు. అయితే, ఇపుడు గోవాలో ఆస్వేచ్ఛను అదుపుచేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
తరచూ పర్యాటకులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో మద్యం తీసుకోవడం కుదరదని రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా రోడ్ల మీద మద్యం తాగితే జరిమానాలు విధిస్తామని, మద్యం షాపుల లైసెన్సులను కూడా రద్దు చేస్తామని సీఎం ప్రకటించారు. రోడ్లపక్కన కూర్చొని మద్యం తాగి, బాటిళ్లను పగలగొట్టి కొంతమంది పర్యాటకుల్లో అభద్రతా భావం సృష్టిస్తున్నందున నిషేధం విధిస్తున్నామని పారికర్ తెలిపారు. గత ఏడాది నుంచే బీచ్‌లోని కొన్ని ప్రదేశాలను ‘నో ఆల్కాహాల్ జోన్’ లుగా ప్రకటించారు.
గోవా అంటేనే బీచ్, కెసినోలకు సుప్రసిద్ధం. గోవాకు పర్యాటకులు పెద్ద ఎత్తున రావడానికి కారణం ఎక్కడ పడితే అక్కడ బార్లు, పబ్‌లు, మద్యం దుకాణాలు. తాజాగా ముఖ్యమంత్రి నిర్ణయం గోవా పర్యాటకులను నిరుత్సాహ పరుస్తోంది. అంతేకాకుండా మద్య వ్యాపారాన్ని కూడా దెబ్బతీయనుందని వ్యాపారులు వాపోతున్నారు. ఇక ముందు గోవాలో మద్యం తాగాలంటే లోపలెక్కడో నాలుగు గోడల మధ్యే తాగాలి. అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత బీచ్‌లో ఈత కొట్టకూడదనే కొత్త నియమాన్ని తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయిని సమాచారం.