బెడిసికొట్టిన మద్యం వ్యూహం
అనకాపల్లి జిల్లాలో దొరికిన రూ.50 లక్షల విలువైన మద్యం
యలమంచిలి జనసేన అభ్యర్థికి విక్రయించేందుకు ఒప్పందం
అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేతలు
భారీగా గోవా మద్యం పట్టుకున్న పోలీసులు
మీడియా సమావేశంలో ఎస్పీ మురళీకృష్ణ వెల్లడి
సాక్షి, అనకాపల్లి: ఎన్నికల్లో ఏదోవిధంగా తాయిలాలతో గెలవాలని, దానికి భారీగా మద్యం అందిస్తేనే ఫలితం ఉంటుందని భావించారు. భారీగా మద్యం తీసుకొచ్చి గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టాలనే ఆలోచనతో టీడీపీ, జనసేన నేతలు దాదాపు 39,163 క్వార్టర్ బాటిళ్లు గోవా నుంచి అక్రమంగా కొనుగోలు చేశారు. దశలవారీగా మద్యాన్ని వినియోగిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా గడ్డివాములో దాచి సమావేశాలు నిర్వహించినప్పుడల్లా గుట్టు చప్పుడు కాకుండా బయటకు తీస్తున్నారు.
తీరా తీగలాగితే డొంక కదిలినట్లు అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తున్న ముగ్గుర్ని పోలీసులు ప్రశ్నిస్తే బండారం బయటపడింది. అనకాపల్లి జిల్లా యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌కు మద్యం విక్రయించేందుకు అక్కడి టీడీపీ నాయకుడు కర్రి వెంకటస్వామి చేస్తున్న అక్రమ మద్యం సరఫరా గుట్టురట్టయింది. వారి నుంచి దాదాపు రూ. 50లక్షల విలువైన 7 వేల లీటర్ల గోవా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
ముగ్గురు టీడీపీ నేతలు అరెస్ట్
అక్రమ మద్యం స్వా«దీనం చేసుకున్న సంఘటనపై అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ శనివారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. యలమంచిలి మండలం సోమలింగపాలెంకు చెందిన ప్రధాన నిందితుడు, టీడీపీ నేత కర్రి వెంకటస్వామి అక్రమంగా మద్యం తీసుకువచ్చి విక్రయిస్తుంటాడు. అతనికి అదే గ్రామానికి చెందిన కర్రి ధర్మతేజ, బొడ్డేటి దినేష్‌కుమార్ సహకరించారు. పది రోజుల క్రితం గోవా నుంచి సరుకు తెప్పించి, యలమంచిలి మున్సిపాలిటీ పరిధి సోమలింగంపాలెంలోని తన పశువుల పాక వద్ద గడ్డివాములో దాచిపెట్టాడు.
ఈ మద్యాన్ని యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒక్కసారిగా ఇస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉందని సమావేశాలు నిర్వహించినప్పుడల్లా వెంకటస్వామి మద్యం అందించేవాడు. శనివారం మధ్యాహ్నం మునగపాక గ్రామంలో అక్రమ మద్యం రవాణా జరుగుతుందని వచ్చిన సమాచారంతో మునగపాక ఎస్సై ఆధ్వర్యంలో పోలీసు బృందం తనిఖీలు నిర్వహించారు.
ముగ్గురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పద వస్తువులను పట్టుకెళుతున్నట్టు గమనించి వారి లగేజ్‌ను తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద 5 కేసుల్లో 180 మిల్లీ లీటర్లు కలిగిన 240 రాయల్ బ్లూ లిక్కర్ బాటిళ్లు లభ్యమయ్యాయి. అంతేగాక మరికొంత మద్యాన్ని దాచిపెట్టినట్లు చెప్పడంతో గడ్డివాము వద్ద భారీ ఎత్తున దాచిన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అక్రమ మద్యం ఎవరెవరికి సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.
డంపు వెనక ఎవరున్నారు, అనే విషయాలను విచారిస్తున్నామని ఎస్పీ చెప్పారు. దీని వెనుక ఎవరున్నా అరెస్టు చేస్తామన్నారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, యలమంచిలి సీఐ గఫNర్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి అనకాపల్లి జిల్లా జడ్జి వద్ద హాజరు పరిచారు. నిందితుల నుంచి రెండు బైక్‌లను స్వాదీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment