
గోల్డ్‌మ్యాన్‌గా పేరొందిన మోజ్ మరిలేరు..
ముంబై : ఒంటి నిండా బంగారు ఆభరణాలతో మెరుస్తూ గోల్డ్ మ్యాన్‌గా పేరొందిన సామ్రాట్ మోజ్ (39) మరణించారు. గుండెపోటుతో పుణేలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పుణేలోని యరవాడ ప్రాంతంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. సామ్రాట్ మోజ్‌కు భార్య, తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పుణేలో పేరొందిన వ్యాపారవేత్త మోజ్‌కు బంగారంపై విపరీతమైన మోజు ఉంది.
నిత్యం ఆయన ఎనిమిది నుంచి పది కిలోల బంగారు ఆభరణాలు ధరించడంతో ఆయనకు గోల్డ్ మ్యాన్ పేరు స్ధిరపడింది. నగర ఎమ్మెల్యే రామభూ మోజ్‌కు ఆయన మేనల్లుడు కావడం గమనార్హం. మరోవైపు తన పేరిట ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్ తయారు చేశారని ఇటీవల మోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక 2011లోనూ బంగారు ఆభరణాలను విరివిగా ధరిస్తారనే పేరున్న రమేష్ మంజాలే 45 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. అప్పట్లో ఆయన అంత్యక్రియలకు ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే హాజరయ్యారు. రమేష్ మరణంతో మోజ్ ఒక్కరే గోల్డ్ మ్యాన్‌గా పేరొందారు.