శశికళ ప్లాన్ గ్రాండ్ సక్సెస్!
చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడింది. విశ్వాసపరీక్షలో సీఎం పళనిస్వామి నెగ్గారు. మొత్తంగా 133 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనగా, పళనికి అనూకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 11 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. దీంతో మెజార్టీ ఓట్లు సాధించిన పళనిస్వామి బలపరీక్షలో విజయం సాధించారు. ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనలేదు. దీంతో పళని విజయం నల్లేరుపై నడకగా మారింది. రిసార్ట్ రాజకీయాలు నెగ్గాయంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పది రోజుల కిందటి వరకూ ఎవరికీ తెలియని కువతూర్‌కు సమీపంలోని గోల్డెడ్ బే రిసార్టులో చిన్నమ్మ శశికళ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను అక్కడ నిర్బంధించారని కథనాలు వచ్చాయి.
ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేలను తనవైపు ఎక్కడ లాగేసుకుంటారోనని శశికళ చేసిన ప్రయత్నం నేడు ఫలించింది. అయితే ఆ ప్రయోజనాన్ని మాత్రం పళనిస్వామి పొందనున్నారు. సుప్రీంకోర్టు శశికళను దోషీగా తీర్పివ్వడంతో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు కోర్టులో లొంగిపోయి అక్కడే మరో మూడున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ ఆశలు గల్లంతు కాగా.. అమ్మ జయలలితకు, తనకు విధేయుడైన పళనిస్వామిని గోల్డెన్ బే రిసార్ట్ లోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వానికి మద్ధతు ఇవ్వకుండా చేయడంలోనూ శశికళ పన్నిన గోల్డెన్ బే రిసార్ట్ క్యాంపు వ్యూహం సక్సెస్ అయింది. అన్నాడీఎంకే మెజార్టీ ఎమ్మెల్యేలు తనకే మద్ధతు ఇవ్వాలని కోరుతూ రిసార్టులో శశికళ చేసిన ప్రసంగాలు వారిని ఐకమత్యంగా ఉంచాయనడంలో సందేహమే అక్కర్లేదు.
గవర్నర్ విద్యాసాగర్ రావును పళనిస్వామి కలుసుకోవడం.. మెజార్టీ ఎమ్మెల్యేల మద్ధతు ఉందని వివరించడం.. ఆపై పళనితో గవర్నర్ ప్రమాణం చేయించడం చకచకా జరిగిపోయాయి. నేడు తమిళనాడు అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో సీఎం పళనిస్వామి నెగ్గారు. ఈ ఓటింగ్ లో పాల్గొన్న వారిలో శశికళ క్యాంపులోని రిసార్ట్ ఎమ్మెల్యేల ఓటింగే పళనిస్వామి సీఎం పీఠాన్ని అందించింది. పన్నీర్ క్యాంపులోని ఆరుగురు ఎమ్మెల్యేలు సహా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేశారు. దాదాపు వారం రోజులపాటు గోల్డెన్ బే రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలలో 122 మంది ఆయనకు మద్ధతు తెలుపుతూ ఓటేయడంతో మెజార్టీ సాధించి చిన్నమ్మ శశికళ విధేయుడు పళనిస్వామి.. జయ వీర విధేయుడు పన్నీర్ సెల్వంపై మరోసారి విజయం సాధించారు.