నేడు జీవోఎం కీలక భేటీ
రాష్ట్ర విభజన విధివిధానాలు దాదాపు ఖరారయ్యే అవకాశం
నదీజలాలు, వనరుల పంపిణీ, ప్యాకేజీలను పరిశీలించనున్న మంత్రుల బృందం
హస్తినలో అందుబాటులో రాష్ట్ర ఉన్నతాధికారులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సంబంధిత విధివిధానాలను ఖరారు చేసేందుకు ఏర్పాటైన ఉన్నతస్థాయి కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) పూర్తిస్థాయి సమావేశం శనివారం సాయంత్రం ఇక్కడ కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యాలయంలో జరగనుంది. హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ, ఆర్థిక మంత్రి చిదంబరం, ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్, పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్‌తో పాటు ప్రత్యేక ఆహ్వానితునిగా ప్రధాని కార్యాలయ సహాయమంత్రి నారాయణసామి పాల్గొననున్నారు. అవసరమైన పక్షంలో జీవోఎంకు స్వయంగా వివరణలివ్వడానికి అందుబాటులో ఉండేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వంలోని సాగునీటి పారుదల, ఆర్థిక, హోం, విద్యుత్, మౌలిక సదుపాయాల శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా శనివారం ఉదయం ఢిల్లీ చేరుకొంటున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలియవచ్చింది.
విభజనకు నిరసనగా సీమాంధ్రలో ఒకపక్క ఆందోళనలు ఉవ్వెత్తున కొనసాగుతుండగా మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన జీవోఎం శనివారం కీలక అంశాలపై దృష్టిసారించనున్నట్టు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులను, నదీజలాలు, విద్యుత్, సహజ వనరుల పంపిణీతో పాటు రెండు రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీలపై నిర్ణయం తీసుకునే దిశగా ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి రెండు రాష్ట్రాలూ పదేళ్ల పాటు సమర్థవంతంగా కార్యకలాపాలు కొనసాగించేలా తీసుకోవాల్సిన చట్ట, పరిపాలన పరమైన చర్యలను కూడా జీవోఎం పరిశీలించనుంది.
అలాగే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, అఖిల భారత సర్వీసులు సహా ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పంపకం, ఆర్టికల్ 371డి కింద రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో తలెత్తే అంశాలపై కూడా బృందం దృష్టి సారించవచ్చని సమాచారం. తమ పరిశీలనకు నిర్దేశించిన మొత్తం పదకొండు అంశాలపై కేంద్రంలోని ఆయా మంత్రిత్వశాఖల నుండి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి అందిన సమగ్ర నివేదికలను సమావేశం పరిశీలించి రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలను రూపొందిస్తుందని సమాచారం.
ఈ నెల 11న జరిగిన తొలి సమావేశానంతరం.. రాష్ట్ర ప్రజల ఆందోళనలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని జీవోఎం పేర్కొంది. ఇందుకోసం అనుసరించాల్సిన పద్ధతులు, పాటించాల్సిన విధివిధానాలపై ఇప్పటికే చర్చలు జరిపింది. వివిధ కీలక అంశాలపై తమ సిఫారసులకు ముందు భాగ స్వామ్యపక్షాలన్నిటి అభిప్రాయాలూ తీసుకుంటామని చెప్పింది. అలాగే సాధారణ ప్రజల అభిప్రాయాలనూ కోరింది. ఈ నేపథ్యంలో జీవోఎం ఆదేశాల మేరకు విద్యుత్, జలవనరుల వంటి కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు.. తాము రూపొందించిన నివేదికలను శనివారం జీవోఎంకు సమర్పిస్తాయని భావిస్తున్నారు.
కేంద్ర మంత్రివర్గానికి సమర్పించాల్సిన నివేదికను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేసి తెలంగాణ బిల్లు పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలివారంలోనే ఉభయ సభల ఆమోదం పొందడం లక్ష్యంగా జీవోఎం పనిచేస్తోందనే అభిప్రాయం నేపథ్యంలో శనివారం నాటి సమావేశం అత్యంత కీలకమైందని హోం శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లు నవంబర్ చివరికల్లా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్తుందని అధికారులంటున్నారు. ఈ నెల 11వ తేదీన జరిగిన జీవోఎం తొలి సమావేశానికి అనారోగ్యం కారణంగా ఆంటోనీ, విదేశీ పర్యటనలో ఉన్న చిదంబరం హాజరుకాలేకపోయిన విషయం తెలిసిందే.