గౌండర్‌ సీఎంతో తేవర్ల ‘బ్యాక్‌సీట్‌’ డ్రైవింగ్‌ | Gounder Chief Minister Edappadi K. Palanisamy | Sakshi
Sakshi News home page

గౌండర్‌ సీఎంతో తేవర్ల ‘బ్యాక్‌సీట్‌’ డ్రైవింగ్‌

Published Thu, Feb 16 2017 6:43 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

గౌండర్‌ సీఎంతో తేవర్ల ‘బ్యాక్‌సీట్‌’ డ్రైవింగ్‌

గౌండర్‌ సీఎంతో తేవర్ల ‘బ్యాక్‌సీట్‌’ డ్రైవింగ్‌

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఎడపాడి కె.పళనిస్వామిని అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ ఎంపికచేయడానికి కారణమేంటి? అనే ప్రశ్నకు పళనిస్వామి కులం కూడా ఓ కారణమనే జవాబు వినిపిస్తోంది. పశ్చిమప్రాంతమైన కొంగునాడుకు చెందిన కొత్త సీఎం కొంగు వెల్లాల గౌండర్‌ కుటుంబంలో జన్మించారు. ఈ వర్గం జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండడమేగాక ఏఐడీఎంకేలో గౌండర్‌ ఎమ్యేల్యేలు ఎస్సీల(31) తర్వాత ఎక్కువ మంది ఉన్నారు.  శశికళ సొంత కులానికి(తేవర్‌) చెందిన తాత్కాలిక ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం(ఓపీఎస్‌) ఎదురుతిరిగాక, జనాభారీత్యా పెద్దకులమైన గౌండర్‌లకు ప్రాధాన్యం ఇచ్చారనే ‘ఇమేజ్‌’తోపాటు, తన చెప్పుచేతల్లో ఉండే రాష్ట్ర సర్కారు సుస్థిరతకు కూడా ఇది ఉపకరిస్తుందనే అంచనాతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

234 మంది సభ్యులున్న ప్రస్తుత తమిళ అసెంబ్లీలో తేవర్ల సంఖ్య ఎక్కువేగాని అన్నా డీఎంకేలో మాత్రం  28 మంది గౌండర్లు, 20 మంది తేవర్లు శాసనసభ్యులుగా ఉన్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాక దివంగత సీఎం జయలలిత ఏర్పాటు చేసిన కేబినెట్‌లో తేవర్లకు ఎక్కువ మంత్రి పదవులు(9) ఇచ్చారు. ఎక్కువ మంది ఉన్న గౌండర్లలో అయిదుగురే మంత్రులయ్యారు. అలాగే పాలకపక్షంలో 19 మంది ఎమ్మెల్యేలున్న వన్నియార్లకూ అయిదే మంత్రి పదవులు దక్కాయి.1991లో జయ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ శశికళతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ప్రభుత్వంలో తేవర్‌ అధికారులకు, పార్టీలో ఈ వర్గం నేతలకు కొంత ఎక్కువ ప్రయోజనం లభించింది. అయితే, 1967లో డీఎంకే, 1977లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సాగిన బ్రాహ్మణేతర సీఎంల పాలనలో ఏ రెండు లేదా ప్రధాన కులాల ఆధిపత్యం లేకుండా రాజకీయాలు, పాలన నడిచాయి. శశికళ రాకతో చాపకింద నీరులా మళ్లీ ఓ కులానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మొదలైంది. బ్రాహ్మణేతరులకు సామాజిక న్యాయం, తమిళానికి ప్రాధాన్యం వంటి నినాదాలతో బలమైన ద్రవిడ సైద్ధాంతిక బలం ఉన్న డీఎంకే నేత ఎం.కరుణానిధిని జయలలిత విజయవంతంగా ఎదుర్కోగలిగారు. అనేక కులాలతో బలమైన సామాజిక సంకీర్ణం నిర్మించి ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె స్త్రీ కావడంతో కులానికి అతీతంగా ఆమె గట్టి పునాదివర్గాన్ని పార్టీకి ఏర్పాటుచేశారు.

కొంగునాడులో ‘క్లీన్‌ స్వీప్‌’కు గౌండర్లే కారణం
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయమే పునాదిగా పైకొచ్చిన సామాజికవర్గాలైన రెడ్డి, కమ్మ మాదిరిగా తమిళనాట తేవర్లు, గౌండర్లు ప్రజాజీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తేవర్ల కన్నా రాజకీయంగా కాస్త ముందున్న గౌండర్లకు మొదట పెద్ద పదవులు లభించాయి. 1926–30 మధ్య కాలంలో అప్పటి మద్రాసు ముఖ్యమంత్రిగా చేసిన పి.సుబ్బరాయన్‌ గౌండరే. ఆయన తర్వాత కేంద్రంలో నెహ్రూ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆయన పెద్ద కొడుకు మోహన్‌ కుమారమంగళం, మనవడు రంగరాజన్‌ కేంద్రమంత్రులుగా ఉన్నారు. కేరళ, కర్ణాటకకు ఆనుకుని ఉన్న కొంగునాడులోని పది జిల్లాల్లో గౌండర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. 1975లో ఈ కులాన్ని బీసీ జాబితాలో చేర్చారు. కిందటేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే వరుసగా రెండోసారి స్వల్ప ఆధిక్యంతో అధికారంలోకి రావడానికి కొంగునాడే కారణమైంది. ఇక్కడి 50 సీట్లలో జయలలిత పార్టీ కైవసం చేసుకున్న 45 స్థానాలే మెజారిటీకి అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ 118 దాటి 135 స్థానాలు గెలుచుకోవడానికి ఈ ప్రాంతంలోని ఆధిపత్య వర్గమైన గౌండర్లు తోడ్పడ్డారు. కొత్త సీఎం పళనిస్వామి సొంత జిల్లా సేలంలోని 11లో పది సీట్లు ఏఐఏడీఎంకే గెల్చుకుంది.
 
నంబర్‌ ‘3’కి ఇద్దరి తర్వాతే అవకాశం!
కిందటి డిసెంబర్‌ మొదటివారంలో జయలలిత మరణించాక తాత్కాలిక ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలనే ప్రశ్న తలెత్తినప్పుడు శశికళ ఒక దశలో పళనిస్వామి వైపు మొగ్గుచూపారని, ఆయన కన్నా సీనియర్‌ గౌండర్‌ అయిన లోక్‌సభ ఉపసభాపతి ఎం.తంబిదురై పేరు కూడా ఆమె పరిశీలించారని వార్తలొచ్చాయి. చివరికి కేబినెట్‌లో జయ తర్వాత రెండో స్థానంలో ఉన్న ఓపీఎస్‌కు మూడోసారి సీఎంగా అవకాశం ఇవ్వడంతో రాష్ట్రంలో రెండు ముఖ్య పదవులు తేవర్ల చేతుల్లోకి వచ్చాయి. తాను కోరినట్టు రెండు నెలలకే  రాజీనామా చేసిన ఓపీఎస్‌ వారం లోపే తిరుగుబాటు చేయడం, ట్రయల్‌ కోర్టు తనకు వేసిన శిక్షను సుప్రీంకోర్టు ఖరారుచేయడంతో శశికళ వ్యూహం మార్చి కిందటేడాది మే నుంచీ అసంతృప్తితో ఉన్న గౌండర్ల మద్దతు కూడా పొందడానికి పళనిస్వామిని సీఎం పదవికి ఎంపికచేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ‘అమ్మ’ కేబినెట్‌లో నంబర్‌ 2 తిరుగుబాటు చేయడం మూడోస్థానంలో ఉన్న పళనిస్వామికి కలిసొచ్చింది. జనాభారీత్యా పెద్దవర్గమైన గౌండర్లకు ఎన్నో దశాబ్దాల తర్వాత ముఖ్యమంత్రి పదవి లభించింది.
                                                                                                     (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement