
55 వేల గ్రామాలకు మొబైల్ సౌకర్యం లేదు
భారతదేశంలో మొబైల్ కనెక్టివిటీ అందుబాటులో లేని గ్రామాలు ఇంకా ఉన్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. 55,669 గ్రామాలు సెల్యులార్ కనెక్టివిటీకి దూరంగా ఉన్నట్లు లోక్‌సభలో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి గ్రామాలు, పట్టణాల్లో టెలి సాంద్రత స్థాయి 48.79 శాతం నుంచి 152.36 శాతం వద్ద ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు.
దేశంలో మొత్తం 5,97,608 గ్రామాలుండగా 5,41,939 గ్రామాల్లో ఇప్పటికే మొబైల్ సేవలు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన 55,669 గ్రామాల్లో నెట్‌వర్క్ అందుబాటులో లేనట్లు ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వివరించారు. అన్ని ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే టెలికాం సేవలకు డిమాండ్ ఉన్నా.. ధర విషయం సున్నితంగా మారిందని ఆయన చెప్పారు. ఇటీవల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి కూడా టెలి సాంద్రతను గుర్తించాల్సి వస్తోందని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల కొనుగో శక్తిలో తేడాలు ఉండటంవల్ల... సాంద్రతలో కూడ భారీ మార్పులు కనిపిస్తున్నట్లు మంత్రి శంకర ప్రసాద్ తెలిపారు.
నేషనల్ టెలికం పాలసీ ద్వారా 2017 నాటికి 70శాతం, 2020 నాటికి వంద శాతం గ్రామీణ ప్రాంతాల్లో టెలి సాంద్రతను పెంచే లక్ష్యంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, టెలికమ్యూనికేషన్ సేవలను మెరుగు పరిచేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపడుతున్నామన్నారు. 3,567.58 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2,199 మొబైల్ టవర్లను వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. 2015 నవంబర్ 30 నాటికి సుమారు 1,134 మొబైల్ టవర్లు ప్రసారం ప్రారంభించాయని మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.