లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో విగ్రహాలపై దాడులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం నూతన విగ్రహ ప్రతిష్ట విషయంలో తీసుకున్న నిర్ణయంపై కూడా పెద్ద ఎత్తున్న వ్యతిరేకత వ్యక్తమతుంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఉన్న స్థానంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ప్రతిష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) పరిసరాల్లో దీన్‌దయాళ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గే సీఎంకు లేఖ రాశారు.
ఈ లేఖపై స్పందించిన సీఎం కార్యాలయం విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకొవాల్సిందిగా డిప్యూటీ కలెక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. విగ్రహ ఏర్పాటు సమయంలో శాంతి భద్రతలు కాపాడాల్సిందిగా పోలీసు శాఖకు సూచించింది. ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు రావడంతో.. గార్గే స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. దీన్‌దయాళ్ విగ్రహాన్ని ప్రతిష్టించడం దళితుల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతో మాత్రం కాదన్నారు. దళితుల హక్కులకై పోరాడిన నాయకుడు దీన్‌దయాళ్ అని పేర్కొన్నారు. ఏఎంసీ పరిసరాల్లో రెండు అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నాయన్నారు. ఒకటి పాతది కాగా.. మరొకటి మయావతి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిష్టించారని తెలిపారు. ప్రస్తుతం పాత దాని స్థానంలో దీన్‌దయాళ్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు వెల్లడించారు. పాత అంబేడ్కర్ విగ్రహాన్ని వేరే చోట ప్రతిష్టించడం కానీ, భద్రపరచడం కానీ చేస్తామని తెలిపారు.
కాగా ఏఎంసీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో.. 90 శాతం, 100 మంది కౌన్సిలర్లలో 24 మంది దళితులు కావడంతో.. వారు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రతన్‌పూర కౌన్సిలర్ ధర్మవీర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయాన్ని తాము ముందునుంచే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం దీన్‌దయాళ్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తే దళితులంతా రోడ్లపైకి వస్తారని హెచ్చరించారు. ఇది కేవలం రెచ్చగొట్టే ప్రయత్నమని అని ఆయన అభిప్రాయపడ్డారు. అంబేడ్కర్ విగ్రహ స్థానంలో దీన్‌దయాళ్ విగ్రహం పెట్టాలనుకోవడం సామాజిక వర్గాల మధ్య దూరం పెంచుతుందని బీఎస్పీ నేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment