pandit deendayal
-
డిజిటల్లో అగ్రగామిగా భారత్
గాంధీనగర్: డిజిటల్ రంగంలో భారత్ త్వరలోనే అగ్రగామిగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. ‘డిజిటల్ రంగం ప్రతీ రోజు, ప్రతీ క్షణం కొత్త పుంతలు తొక్కుతున్న దేశం ఏదైనా ఉందంటే.. అది భారత్ మాత్రమేనని ఘంటాపథంగా చెప్పగలను. మొబైల్ డేటా విభాగంలో ప్రపంచ దేశాల జాబితాలో 155వ స్థానంలో ఉండే భారత్ కేవలం 24 నెలల్లోనే నంబర్ వన్ స్థాయికి చేరింది. అలాగే నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాల్లో కూడా వచ్చే 24 నెలల్లో అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముకేశ్ ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. భారతదేశం.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీ అని ఆయన పేర్కొన్నారు. -
‘ఆ అయిదు పథకాల పేర్లు మారాయి’
రాయ్‌పూర్ : ప్రభుత్వాలు మారగానే కీలక విధానాల సంగతి ఎలా ఉన్నా ప్రముఖ పథకాలు, ప్రాజెక్టుల పేర్లు మారుతుంటాయి. ఇదే ఒరవడిలో చత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసి భూపేశ్ బఘేల్ సారథ్యంలో నూతనంగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరెస్సెస్ సిద్ధాంతకర్త, దివంగత జన సంఘ్ నేత పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పేరుతో ఉన్న 5 పధకాల పేర్లు మార్చింది. పురపాలక, అభివృద్ధి శాఖలకు చెందిన ఈ పధకాలకు మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ల పేర్లు పెట్టారు. ఆయా పధకాల పేర్లు మార్చుతూ ప్రభుత్వం సోమవారం రాత్రి నోటికేషన్ జారీ చేసిందని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యా స్వావలంభన యోజన పథకాన్ని రాజీవ్ గాంధీ స్వావలంభన యోజనగా, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ సర్వసమాజ్ మంగళ భవన్‌ను ఇక నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సర్వసమాజ్ మంగళభవన్‌గా వ్యవహరిస్తారు. కాగా పండిట్ దీన్‌దయాళ్ శుద్ధి నీటిని ఇకమీదట ఇందిరా ప్రియదర్శిని శుద్ధ పేజల్‌గా పిలుస్తారు. కాగా అభివృద్ధి పధకాల పేర్ల మార్పు నిర్ణయాన్ని చత్తీస్‌గఢ్ మాజీ సీఎం, బీజేపీ నేత రమణ్ సింగ్ ఖండించారు. చత్తీస్‌గఢ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న పేర్ల మార్పు తతంగానికి నిరసనగా తాము ఆందోళనల బాట పడతామని చత్తీస్‌గఢ్ మాజీ సీయం, బీజేపీ నేత రమణ్ సింగ్ వాపోయారు. ప్రభుత్వ తీరుపై తాము చత్తీస్‌గఢ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని రమణ్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మెంటాలిటీకి చత్తీస్‌గఢ్ సర్కార్ తీరు నిదర్శమని ఆయన చెప్పకొచ్చారు. -
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం
లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో విగ్రహాలపై దాడులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం నూతన విగ్రహ ప్రతిష్ట విషయంలో తీసుకున్న నిర్ణయంపై కూడా పెద్ద ఎత్తున్న వ్యతిరేకత వ్యక్తమతుంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఉన్న స్థానంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ప్రతిష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) పరిసరాల్లో దీన్‌దయాళ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గే సీఎంకు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన సీఎం కార్యాలయం విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకొవాల్సిందిగా డిప్యూటీ కలెక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. విగ్రహ ఏర్పాటు సమయంలో శాంతి భద్రతలు కాపాడాల్సిందిగా పోలీసు శాఖకు సూచించింది. ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు రావడంతో.. గార్గే స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. దీన్‌దయాళ్ విగ్రహాన్ని ప్రతిష్టించడం దళితుల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతో మాత్రం కాదన్నారు. దళితుల హక్కులకై పోరాడిన నాయకుడు దీన్‌దయాళ్ అని పేర్కొన్నారు. ఏఎంసీ పరిసరాల్లో రెండు అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నాయన్నారు. ఒకటి పాతది కాగా.. మరొకటి మయావతి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిష్టించారని తెలిపారు. ప్రస్తుతం పాత దాని స్థానంలో దీన్‌దయాళ్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు వెల్లడించారు. పాత అంబేడ్కర్ విగ్రహాన్ని వేరే చోట ప్రతిష్టించడం కానీ, భద్రపరచడం కానీ చేస్తామని తెలిపారు. కాగా ఏఎంసీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో.. 90 శాతం, 100 మంది కౌన్సిలర్లలో 24 మంది దళితులు కావడంతో.. వారు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రతన్పూర కౌన్సిలర్ ధర్మవీర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయాన్ని తాము ముందునుంచే వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం దీన్‌దయాళ్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తే దళితులంతా రోడ్లపైకి వస్తారని హెచ్చరించారు. ఇది కేవలం రెచ్చగొట్టే ప్రయత్నమని అని ఆయన అభిప్రాయపడ్డారు. అంబేడ్కర్ విగ్రహ స్థానంలో దీన్‌దయాళ్ విగ్రహం పెట్టాలనుకోవడం సామాజిక వర్గాల మధ్య దూరం పెంచుతుందని బీఎస్పీ నేతలు చెబుతున్నారు. -
'తెలంగాణలో బీజేపీదే అధికారం'
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్లగొండ జిల్లా రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. జిల్లాలోని పెద్దదేవుల పల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 2019 లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీ గత రెండు ఏళ్లుగా పోరాటం చేస్తోందని..మోదీ అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. దక్షిణ భారతంలో బీజేపీ అధికారానికి తెలంగాణ ముఖ ద్వారంగా ఉంటందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ అభివృద్ధితో పాటు దేశ రక్షణ కోసం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తురన్నారు. మోదీని బలపరచడానికి తెలంగాణ ప్రజలంతా వచ్చారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. -
దీన్‌దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్‌షా
నల్లగొండ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్లగొండ జిల్లా రెండో రోజు పర్యటన ప్రారంభమైంది. నల్లగొండ మండలంలోని వెలుగుపల్లి గ్రామంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. స్థానిక ఎస్సీ కాలనీకి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కాలనీగా నామకరణం చేశారు. అనంతరం గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు. కనగల్ మండలం చిన్న మాదారం గ్రామంలో పర్యటించారు. ఉజ్వల గ్యాస్ పథకం కింద ఇంటింటికీ గ్యాస్, ఇంటింటికీ మరుగుదొడ్లు ఉండడం చాలా సంతోషమన్నారు. మోదీ నాయకత్వంలో 107 పథకాలు అమలు అవుతున్నాయని, ఈ కేంద్ర పథకాలు అన్ని గ్రామాల్లో అమలు అయితే గ్రామ స్వరాజ్యం వెల్లివిరుస్తుందన్నారు. తమ గ్రామానికి వచ్చి అమిత్‌షా అభినందించడంతో సర్పంచ్ భాగ్యమ్మ ఆనందం వ్యక్తం చేశారు. -
టీ అమ్మిన వ్యక్తి ప్రధాని
హైదరాబాద్: పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ స్ఫూర్తితోనే టీ అమ్మిన వ్యక్తి ప్రధాని అయ్యారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ మాటలు అన్నారు. దీనదయాళ్ 98వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు భవిష్యత్ లేదన్నారు. మతం గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడినట్లు నిరుపిస్తారా? అని ప్రశ్నించారు. అమలుకు సాధ్యంకాని హామీలను టిఆర్ఎస్ ఇచ్చిందని విమర్శించారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ దీనదయాళ్ స్ఫూర్తితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఎంపి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ 2019లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందన్నారు. టిఆర్ఎస్పై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందన్నారు. **