మహిళలు మద్యం తాగే విషయం నాకు తెలియదు
పబ్‌లకు వెళ్లినా పండ్లరసమే సేవిస్తానంటున్నారు కాజల్ అగర్వాల్. ఏమిటి తాటి చెట్టు కింద చల్ల తాగుతున్నానన్న పాత సామెత గుర్తొస్తుందా? ఇంతకీ ఈ బ్యూటీ పబ్‌ల వ్యవహారం ఏమిటో చూద్దామా? ఆ మధ్య ప్రియా ఆనంద్ అరిమానంబి చిత్రంలో గ్లాసులు గ్లాసుల మద్యం తాగి రచ్చకెక్కింది. ఏమిటమ్మ ఆ నటన అంటే, ఏం మగాళ్లు మద్యం సేవించడం లేదా? వాళ్లకో న్యాయం ఆడళ్లకో న్యాయమా అంటూ ఎదురు ప్రశ్నలు గుప్పించి సంచలనం సృష్టించింది. ఆ సంఘటన మరుగున పడుతోందనుకుంటున్న సమయంలో కాజల్ అగర్వాల్ తెలుగు చిత్రం గోవిందుడు అందరి వాడే చిత్రంలో ఫారిన్ సరుకు గడగడా తాగేసి మరోసారి చర్చల్లో కెక్కారు.
దీంతో కాజల్ అగర్వాల్ తరచూ పబ్‌లకు, బార్‌లకు వెళతారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఇందుకు ఈ బ్యూటీ వివరణ భిన్నంగా ఉంది. గోవిందుడు అందరివాడే చిత్రకథ చెప్పినప్పుడే దర్శకుడు చిత్రంలో మద్యం తాగే సన్నివేశం ఉంటుందని చెప్పారన్నారు. అలాంటి సన్నివేశంలో నటించే విషయమై తాను సంకోచించగా ఈ రోజుల్లో చాలామంది ఆడవారు తరచూ పబ్‌లకు వెళుతున్నారు. అక్కడ వారు మద్యం సేవించడం అనేది సర్వసాధారణం అని చెప్పారన్నారు. దర్శకుడలా క న్విన్స్ చేయడంతో తాను అలా నటించానని వివరించారు. నిజానికి మహిళలు మద్యం తాగే విషయం తనకు తెలియదన్నారు.
తానెప్పుడూ మద్యం తాగలేదన్నారు. చిన్న వయసు నుంచే ఏది తప్పు ఏది ఒప్పు అనేది తనకు కుటుంబ సభట్యులు నేర్పించారని పేర్కొన్నారు. అయితే స్నేహితులతో పబ్‌లకు వెళుతానని అక్కడ పండ్లరసం మాత్రమే సేవిస్తానని తెలిపారు. ఇక మగవారైనా, ఆడవారైనా మద్యం సేవించడం చెడ్డ అలవాటన్నారు. దీని వలన చాలా కుటుం బాలు వేదనకు గురవుతున్నాయన్నారు. ఇకపోతే సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు పెట్టేది జాలీ కోసమేనని స్పష్టం చేశారు. వాటిని నిజ జీవితంలో ఎవరూ అనుసరించరాదని కాజల్ హితవు పలికారు.