న్యూఢిల్లీ: ఉద్యోగుల పెన్షన్‌కు సంబంధించి తొలి మూడేళ్లపాటు ఈపీఎస్ (ఉద్యోగుల పెన్షన్ పథకం) యాజమాన్యం వాటాను పూర్తిగా కేంద్రం చెల్లించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. తద్వారా కొత్త ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలను ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరి, రూ.15 వేలలోపు వేతనం అందుకునే ఉద్యోగుల పెన్షన్ ఖాతాలకు ఇది వర్తిస్తుంది.
అలాగే ఎవరైనా 2016 ఏప్రిల్ 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారుంటే.. అలాంటి వారి పెన్షన్ ఖాతాలకు సంబంధించి తొలి మూడేళ్లలో ఇప్పటి నుంచి మిగిలిన కాలానికి కేంద్రం యాజమాన్యం వాటాను చెల్లిస్తుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశమైంది. ఫాస్ఫరిక్ అండ్ పొటాషియం (పీ అండ్ కే) ఎరువులపై వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవ్వనున్న రాయితీ రేట్లనూ కేబినెట్ ఆమోదించింది. పొటాష్, సల్ఫర్‌లకు రాయితీని పెంచిన కేంద్రం నైట్రోజన్, ఫాస్ఫరస్‌లకు తగ్గించింది. సవరించిన ధరల ప్రకారం కేజీ పొటాషియంపై రూ.15.2, సల్ఫర్‌పై రూ.2.7, నైట్రోజన్‌పై రూ.18.9, కేజీ ఫాస్ఫరస్‌పై రూ.11.12 రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది.
మరికొన్ని నిర్ణయాలు: ఈశాన్య రాష్ట్రాల్లో పలు కొత్త ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న వివిధ పథకాలను 2020 మార్చి వరకు పొడిగించింది. ఈశాన్య మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక అభివృద్ధి ప్రాజెక్టు కింద చేపట్టే అన్ని పనులకూ 100 శాతం నిధులు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఆయుష్ (ఆయుర్వేద,యోగ, న్యాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) వైద్యులు ఓ బ్రిడ్జి కోర్సు చేసి ఆధునిక వైద్య సేవలు ప్రారంభించేందుకు ఉన్న వెసులుబాటును మంత్రివర్గం తొలగించింది.
అలాగే ఇకపై దేశంలోని ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులందరికీ ఉమ్మడిగా నెక్స్‌ట (నేషనల్ ఎగ్జిట్ టెస్ట్) పేరుతో తుది పరీక్షలను నిర్వహించనుంది. ప్రాక్టీసు లైసెన్సు కోసం మరో పరీక్షతో పనిలేకుండా నెక్స్›్టలో అర్హత సాధించిన వారికి దేశంలో వైద్య సేవలకు అనుమతులు లభిస్తాయి. విదేశాల్లో వైద్య విద్య చదివిన వారినీ నెక్స్›్టలో అర్హత సాధించాకే దేశంలో ప్రాక్టీసుకు అనుమతిస్తారు. ళీవిద్యా రుణాలకు సంబంధిచిన ‘క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ (సీజీఎఫ్‌ఎస్‌ఈఎల్)’ ‘సెంట్రల్ సెక్టార్ ఇంట్రస్ట్ సబ్సిడీ (సీఎస్‌ఐఎస్)’ అనే రెండు పథకాలను కొనసాగించేందుకు ఆమోదం. వీటి కోసం 2017–18 నుంచి 2019–20 మధ్య రూ.6,600 కోట్ల వ్యయం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment