సాక్షి, న్యూఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్ధానంలో మరో ఉన్నత విద్యా నియంత్రణ సంస్థకు శ్రీకారం చుట్టేలా బుధవారం కేంద్రం నూతన చట్ట ముసాయిదాను ప్రతిపాదించింది.యూజీసీ స్ధానంలో భారత ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు కానుంది. ఇందుకు మార్గం సుగమం చేస్తూ యూజీసీ చట్టం, 1956ను తొలగిస్తూ నూతన ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. నూతన ముసాయిదా చట్టంపై జులై 7లోగా విద్యాసంస్థలు, మేథావులు, నిపుణులు, తల్లితండ్రులు తమ విలువైన సూచనలు, సలహాలను పంపాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్వీట్ చేశారు.
ఉన్నత విద్యా సంస్థలకు మరింత ప్రతిపత్తి కల్పించే నియంత్రణ వ్యవస్థలను సంస్కరించే క్రమంలో ముసాయిదా చట్టం తీసుకువచ్చామని మంత్రి స్పష్టం చేశారు. నాణ్యమైన విద్య, మరిన్ని అధికారాలను కల్పించడం వంటి ఆశయాలతో ఉన్నత విద్యా నియంత్రణ సంస్థలో ప్రభుత్వం మార్పులు చేపట్టిందని చెప్పారు. యూజీసీ చట్టం స్ధానంలో ఉన్నత విద్యా కమిషన్ చట్టం 2018ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.
దేశంలో కొత్తగా ఏర్పాటయ్యే జాతీయ ప్రాధాన్యమున్న విద్యా సంస్థలు ఇక ఉన్నత విద్యా కమిషన్ పరిధిలో ఏర్పాటవుతాయి. కాగా, విశ్వవిద్యాలయాలకు నిధులను సమకూర్చడంలో యూజీసీ కీలక పాత్ర పోషిస్తున్న క్రమంలో ఇక ఈ బాధ్యతలను ఉన్నత విద్యా కమిషన్ తలకెత్తుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment