చైనాకు భారత్ ఝలక్ ఇస్తుందా?
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారి, పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ చీఫ్ మసూద్ అజార్‌పై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించకుండా చైనా అడ్డుకోవడంపై భారత్ ఆగ్రహంగా ఉంది. ఈ విషయంలో చైనాకు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో చైనా పెట్టుబడులకు అనుమతించే విషయమై కేంద్రం పునరాలోచన చేయవచ్చునని సమాచారం.
దేశంలో చైనా పెట్టుబడులకు భద్రతా అనుమతులు ఇచ్చే విషయంలో కేంద్రం పునరాలోచన చేయడమంటే.. ఐరాసలో చైనా చర్యకు దీటుగా బదులు ఇవ్వడమేనని అధికార వర్గాలు చెప్తున్నాయి. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడితోపాటు భారత్ వ్యతిరేక చర్యలు చేపడుతున్న అజార్‌ను అంతర్జాతీయంగా నిషేధించాలని భారత్ చాలాకాలంగా కోరుతోంది. అయితే అతడిపై నిషేధ తీర్మానాన్ని ఐరాసలో తన వీటో అధికారంతో చైనా తిరస్కరించడం భారత్‌ను అసంతృప్తికి గురిచేసింది.
'చైనా దౌత్యపాలసీలో పాకిస్థాన్‌కు ప్రత్యేక స్థానముంది. అందులో భాగంగానే ఐరాసలో చైనా చర్యను చూడాల్సి ఉంటుంది. ఉగ్రవాదం పీడ చైనాపై పడితేగానీ ఆ దేశం పాకిస్థాన్‌కు మద్దతు తెలుపడం మానుకోదు' అని ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. 1962 భారత్-చైనా యుద్ధంనాటి నుంచి ఆసియా దిగ్గజాలైన ఈ ఇరుదేశాలకు సత్సంబంధాలు లేవు. అరుణాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ లోని లడఖ్ విషయమై రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే.