సాక్షి, న్యూఢిల్లీ : ‘ముస్లింలను మెప్పించడం కోసం కాకుండా మైనారిటీలు సమాజంలో గౌరవప్రదంగా జీవించడం కోసం కృషి చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోంది. అందుకని ముస్లింల హజ్ యాత్రకు ఏటా కేటాయిస్తున్న దాదాపు 700 కోట్ల రూపాయలను ఇక నుంచి ముస్లిం మహిళల విద్యాభివద్ధికి ఖర్చు చేస్తాం’ అని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం నాడు ప్రకటించడం ఎంతైనా ముదావహం. ఇదేమి బీజేపీ ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు. హజ్ యాత్రకు కేంద్రం కల్పిస్తున్న సబ్సిడీని పదేళ్ల కాలంలో పూర్తిగా ఎత్తివేయాలని సుప్రీం కోర్టు 2012లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సొమ్మును ముస్లింల విద్యా, సామాజికాభివద్ధికి ఖర్చు పెట్టాలని కూడా సుప్రీం కోర్టు సూచించింది.
నాలుగేళ్లకు ముందుగానే సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం హజ్ యాత్రకు ఇస్తున్న సబ్సిడీని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం సున్నితమైన అంశమే. ఏ సెక్యులర్ ప్రభుత్వం అయినా సరే ప్రజల మత కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులను ఖర్చు పెట్టరాదు. మన రాజ్యాంగంలోని సెక్యులర్ అనే పదానికి అదే అర్థం. అందుకనే కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల హజ్ యాత్రకు సబ్సిడీని ప్రకటించడాన్ని బీజేపీ ‘సూడో సెక్యులరిజమ్’ అంటూ విమర్శించింది. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబే. మరి కుంభమేళా లాంటి హిందూ మతపరమైన కార్యక్రమాలకు కోట్లాది రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెట్టడాన్ని ఆపేస్తుందా? భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే కార్యక్రమాల సందర్భంగా వారికి తగిన సౌకర్యాలు కల్పించడం, శాంతి భద్రతల పరిరక్షణకు తగిన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వం బాధ్యతని ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు సమర్థించుకోవచ్చు.
కైలాస మానససరోవర్ యాత్ర సందర్భంగా టిబెట్ వెళ్లే హిందూ భక్తుల ప్రయాణానికి, వారి బసకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులను విడుదల చేస్తోంది? వీటిని కూడా తక్షణం నిలిపివేయాలి కదా! కేంద్రమే కాకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మత కార్యక్రమాలకు నిధులను విడుదల చేయడమే కాకుండా, దగ్గరుండి కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి? బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలు కూడా ప్రభుత్వ నిధులతో హిందూ మత కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇక బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వమైతే అయోధ్య, మధురలతోపాటు కేరళలోని సెయింట్ థామస్ చర్చిని సందర్శించే వృద్ధులకు, వారి సహాయకులకు సబ్సిడీలను ఇస్తోంది. అంతేకాకుండా పాకిస్థాన్, చైనా, కాంబోడియా, శ్రీలంకలో హిందూ పుణ్యక్షేత్రలను దర్శించుకునే భక్తులకు కూడా రాయితీలు ఇస్తోంది.
ఇక మానస సరోవర యాత్రకు ఇస్తున్న నిధులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవలనే రెట్టింపు చేశారు. భక్తుల బస కోసం ‘మానససరోవర్ భవన్’ను నిర్మించాలని కూడా ఆయన నిర్ణయించారు. హజ్‌యాత్ర విషయంలో తీసుకున్నట్లుగానే హిందూ మత కార్యక్రమాల విషయంలో కూడా కేంద్ర, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. లేకపోయినట్లయితే బీజేపీ ప్రభుత్వాలదే సూడో సెక్యులరిజమ్, హిందూ అప్పీజ్‌మెంట్ అవుతుంది. వారికో న్యాయం, వీరికో న్యాయం అన్నట్లు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment