
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ ) ద్వారా ఆశించినంత వసూళ్లు జరగకపోవడంతో పలు వస్తువుల జీఎస్‌టీని సవరించాలని, పన్ను శ్లాబుల్ని పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 18న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి భేటీ కానుంది. ఆ మండలి సమావేశంలో జీఎస్టీ పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటారు. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన ఆర్థిక శాఖ అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. ధరల స్థిరీకరణ, జీఎస్టీలో పన్నుల శాతం పెంపుపై కొన్ని సిఫార్సులు చేశారు. ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%; 28% శ్లాబులు ఉన్నాయి.
28శాతం కంటే తక్కువ ఉన్న శ్లాబుల్లో కూడా అదనంగా సెస్ వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర ఖజానాకి ఆశించినంత ఆదాయం రావడం లేదు. 5 శాతం పన్నుని 8శాతానికి , 12 నుంచి 15 శాతానికి పెంచే అవకాశాల్ని కూడా పరిశీలించినట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ధరల్ని స్థిరీకరిస్తూనే ఖజానా ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించారు. కొన్ని వస్తువులపై భారీగా సెస్ విధించాలని కూడా జీఎస్టీ మండలి యోచిస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతమున్న పన్ను రేటు శ్లాబుల్ని మూడుకి కుదించాలని భావిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్–నవంబర్ మధ్య జీఎస్టీ పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాలకంటే 40శాతానికి తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment