Stabilization schemes
-
గరిష్ట స్థాయిలో స్థిరీకరణకు అవకాశం
ముంబై: కొత్త సంవత్సరం తొలి వారంలో స్టాక్ సూచీలు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆటో సేల్స్ అమ్మకాలు, పీఎంఐ డేటా, ఎఫ్ఓఎంసీ మినిట్స్, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలుగా ఉన్నాయి. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘గత ఏడాది ట్రేడింగ్ చివరి వారంలో సూచీలు జీవితకాల గరిష్టాలను తాకడంతో ఏర్పడిన అధిక వాల్యుయేషన్ల కారణంగా సూచీలు కొద్ది రోజుల పాటు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధిక కొనుగోళ్లు జరిగినందున, కొంత లాభాల స్వీకరణ ఉండొచ్చు. కావున ట్రేడర్లు స్థిరీకరణలో భాగంగా దిగివచి్చన నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసే వ్యూహాన్ని అమలు చేయాలి. ఈ వారం నిఫ్టీ ఎగువ స్థాయిలో 22,000 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 22,200 వరకూ ర్యాలీ కొనసాగుతుంది. అనుకున్నట్లే లాభాల స్వీకరణ జరిగితే దిగువ స్థాయిలో 21,500 వద్ద బలమైన తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు పర్వేశ్ గౌర్ తెలిపారు. ఆటో అమ్మకాలు ఆటో కంపెనీలు డిసెంబర్ నెల వాహన అమ్మకాలను నేడు(సోమవారం) విడుదల చేయనున్నాయి. టూ వీలర్స్ అమ్మకాలు రెండింతల వృద్ధి నమోదు చేయోచ్చని, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య, ట్రాకర్ విభాగ విక్రయాల వృద్ధి ఫ్లాటుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. విక్రయ గణాంకాలు వినియోగ డిమాండ్, పరిశ్రమ స్థితిగతులను తెలియజేస్తాయి. ఎఫ్ఓఎంసీ మినిట్స్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్లో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలు గురువారం వెల్లడి కాన్నాయి. ఈ 2024లో మూడుసార్లు వడ్డీరేట్ల కోత ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో ఎఫ్ఓఎంసీ మినిట్స్ కీలకం కానున్నాయి. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణ అవుట్‌లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. డిసెంబర్లో రూ.66,000 కోట్లు పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్లో 66,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. యూఎస్ ఫెడ్ రిజర్వు ద్రవ్య లభ్యత పరిస్థితుల కఠినతరం ముగిసిందని సంకేతాలిచ్చింది. వచ్చే మార్చి నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని తెలిపింది. దీంతో యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ భారీగా పతనమైంది. ఈ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి డిసెంబర్లో విదేశీ నిధుల వరద పోటెత్తింది. ఇక 2023లో భారత్ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.1.71 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్లతో పాటు డెట్, హైబ్రీడ్, డెట్ –వీఆర్ఆర్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఎన్ఎస్డీఎల్ డేటా చెబుతున్నది. ఇండియన్ డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐ నికర పెట్టుబడులు రూ.68,663 కోట్లు ఉన్నాయి. -
గోధుమలు, బియ్యం ధరల స్థిరీకరణ
సాక్షి, అమరావతి: గోధుమలు, గోధుమ పిండి, బియ్యం రిటైల్ ధరలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్ – డొమెస్టిక్) ద్వారా బహిరంగ మార్కెట్లో గోధుమలు, బియ్యాన్ని విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పథకం కింద 25 లక్షల టన్నుల బియ్యం, 50 లక్షల టన్నుల గోధుమలను మార్కెట్లోకి తెస్తోంది. ప్రస్తుతం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) వద్ద ఆంధ్రప్రదేశ్‌లో 7.61 లక్షల టన్నుల బియ్యం, 10,703 టన్నుల గోధుమలు ఉన్నాయి. వీటికి అదనంగా సెంట్రల్ పూల్ కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద మరో 8.40 లక్షల టన్నుల బియ్యం ఉన్నాయి. ఓఎంఎస్ఎస్ (డీ) పథకం కింద ఎఫ్‌సీఐ ప్రతివారం నిర్వహించే ఈ–వేలంలో భాగంగా అమరావతిలోని ఎఫ్‌సీఐ ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 23న 5 వేల టన్నుల గోధుమలు, 13,200 టన్నుల బియ్యాన్ని మార్కెట్లోకి తెస్తున్నారు. ఈ–వేలంలో పాల్గొనదలి్చన వారు ఈఎండీ మొత్తాన్ని ఎల్రక్టానిక్ మోడ్ ద్వారా జనరల్ మేనేజర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, అమరావతి పేరిట ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు జమ చేయాలి. ఆసక్తి కలిగిన పిండి మిల్లులు, గోధుమ పిండి ప్రాసెసర్లు, గోధుమ ఉత్పత్తుల తయారీదారులు ఈ–వేలంలో పాల్గొనేందుకు www. valuejunction.in/ fci లో ఎం.జంక్షన్‌ని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. వేలంలో గోధుమలు కొన్న వారు 30 రోజులలోపు ప్రాసెస్ చేసి రిటైల్ మార్కెట్లోకి విడుదల చేయాలి. బియ్యం వేలంలో వ్యాపారులు కూడా పాల్గొనవచ్చు. ఎఫ్ఆర్కే బియ్యం రిజర్వ్ ధర క్వింటాల్‌కు రూ.2,973, ఎఫ్ఆర్కే కాని బియ్యం రిజర్వ్ ధర క్వింటాల్‌కు రూ.2,900గా నిర్ణయించారు. ఆసక్తి గల బిడ్డర్లు, వ్యాపారులు వెబ్సైట్ ద్వారా వారి వివరాలను సమరి్పంచి ఈ వేలంలో పాల్గొనవచ్చని ఎఫ్‌సీఐ ఏపీ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ జోషి శనివారం ఓ ప్రకటనలో కోరారు. -
ఇకపై జీఎస్టీ వడ్డన!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. వస్తు సేవల పన్ను(జీఎస్టీ ) ద్వారా ఆశించినంత వసూళ్లు జరగకపోవడంతో పలు వస్తువుల జీఎస్టీని సవరించాలని, పన్ను శ్లాబుల్ని పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 18న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి భేటీ కానుంది. ఆ మండలి సమావేశంలో జీఎస్టీ పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటారు. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన ఆర్థిక శాఖ అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. ధరల స్థిరీకరణ, జీఎస్టీలో పన్నుల శాతం పెంపుపై కొన్ని సిఫార్సులు చేశారు. ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%; 28% శ్లాబులు ఉన్నాయి. 28శాతం కంటే తక్కువ ఉన్న శ్లాబుల్లో కూడా అదనంగా సెస్ వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర ఖజానాకి ఆశించినంత ఆదాయం రావడం లేదు. 5 శాతం పన్నుని 8శాతానికి , 12 నుంచి 15 శాతానికి పెంచే అవకాశాల్ని కూడా పరిశీలించినట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ధరల్ని స్థిరీకరిస్తూనే ఖజానా ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించారు. కొన్ని వస్తువులపై భారీగా సెస్ విధించాలని కూడా జీఎస్టీ మండలి యోచిస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతమున్న పన్ను రేటు శ్లాబుల్ని మూడుకి కుదించాలని భావిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్–నవంబర్ మధ్య జీఎస్టీ పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాలకంటే 40శాతానికి తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. -
69.50–72 శ్రేణిలో రూపాయి స్థిరీకరణ!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ 69.50 – 72 శ్రేణిలో స్థిరీకరణ జరుగుతున్నట్లు కనపడుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ గురువారం 36 పైసలు నష్టపోయి, 71.16 వద్ద ముగిసింది. గురువారం 70.90 వద్ద ప్రారంభమైన రూపాయి, ఒకదశలో 71.18 స్థాయికి పడింది. బుధవారం రూపాయి ముగింపు 70.80. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల పటిష్టత, ప్రధాన కరెన్సీలపై డాలర్ బలపేత ధోరణి, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి వెనక్కు వెళుతున్న నిధులు రూపాయి బలహీనతకు తక్షణ కారణం. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని 69.40 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి 10 డాలర్లకుపైగా పెరగడంతో రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. ఈక్విటీ మార్కెట్ల నష్టాలూ ఇందుకు తోడవుతున్నాయి. ఆయా పరిస్థితుల్లో రూపాయి ప్రస్తుతం స్థిరీకరణ బాటలో ఉందని భావిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రేటజీ హెడ్ వీకే శర్మ విశ్లేషించారు. -
యాసంగికి 1.70 లక్షల ఎకరాలకు నీరు
ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: వచ్చే యాసంగికి ఎత్తిపోతల పథకాల(లిఫ్టులు) కింద 1.70 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి వెల్లడించారు. కొత్తగా చేపట్టిన 74 పథకాల్లో 45 పథకాలను పూర్తి చేయడంతో 70 వేల ఎకరాలు, మరో 154 పథకాలను పునరుద్ధరణ చేయడం ద్వారా 90 వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఐడీసీ పథకాలపై నీటి పారుదల శాఖ సెక్రటరీ వికాస్‌రాజ్, ఐడీసీ ఎండీ సురేశ్‌కుమార్‌లతో కలసి అన్ని జిల్లాల ఎస్ఈ, ఈఈలతో శంకర్‌రెడ్డి గురువారం సమీక్ష జరిపారు. ఐడీసీ పథకాల కింద నిర్ణయించిన ఆయకట్టు లక్ష్యాలు, జరుగుతున్న పనుల తీరుపై చర్చించారు. అనంతరం శంకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 582 ఎత్తిపోతల పథకాల్లో 404 పథకాలు పనిచేయడం లేదని, దశలవారీగా వాటిని పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా 12 ఎత్తిపోతలు ముంపునకు గురయ్యాయని, వీటిని కొత్తగా చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టామని వివరించారు. ఈ ఎత్తిపోతల పథకాలకు అందాల్సిన నిధులపై త్వరలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 5 కొత్త ఎత్తిపోతల పథకాలను ఈ నెల 28న ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.