
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల్లో విజయం బీజేపీ, కాంగ్రెస్‌లకు సవాల్‌గా మారింది. 22 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా పట్టు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. అటు, బీజేపీ కూడా పట్టుతప్పకుండా వీలైనన్ని మార్గాల్లో ముందుకెళ్తోంది. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల పోల్ మేనేజ్‌మెంట్ నైపుణ్యానికి గుజరాత్ పెద్ద పరీక్షగా మారింది. ఇద్దరూ ఇదే రాష్ట్రం నుంచి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నందున.. అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునేలా వ్యూహాలు రచించటం సవాల్ లాంటిదే. ఈ ఎన్నికలు జీఎస్టీ, నోట్లరద్దుకు అసలు పరీక్ష అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఇద్దరూ తరచుగా గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఫలితాల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఇంటా–బయటా, ప్రభుత్వంలో–పార్టీలో ఈ ద్వయానికి చిక్కులు తప్పవు. దీంతోపాటుగా బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నానికి బలం చేకూరినట్లవుతుంది. మరోమాటలో చెప్పాలంటే 2019 సార్వత్రిక ఎన్నికలకు గుజరాత్ అసెంబ్లీ పోరు సెమీఫైనల్స్ లాంటిది.
అభివృద్ధి నినాదంతో..
అందుకే రెండు నెలల్లో మోదీ ఆరుసార్లు గుజరాత్‌లో పర్యటించారు. కుల, హిందుత్వ అంశాలకంటే వ్యాపారులను ఆకట్టుకోవటం, అభివృద్ధి పనులకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. గత నెలలలో జపాన్ ప్రధాని షింజో అబేను గుజరాత్‌కు తీసుకొచ్చి బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేశారు. ఇటీవలే సౌరాష్ట్ర ప్రాంతానికి మేలు జరిగే.. ఫెర్రీ సర్వీసునూ మోదీ ప్రారంభించారు. మరోవైపు, పార్టీ చీఫ్ అమిత్ షా క్షేత్రస్థాయిలో పనిచేసుకుపోతున్నారు. 30వేల మంది బూత్‌స్థాయి కార్యకర్తలను ఆయన నియమించారు. ఈసారి 150 స్థానాలను కైవసం చేసుకోవాలనే వ్యూహంతో దూసుకుపోతున్నారు. మోదీలాగే గుజరాత్‌లోని ప్రతిమూలపైనా అమిత్‌షాకు పట్టుంది. అందుకే ఏయే ప్రాంతాల్లో పట్టుకోసం ఏమేం చేయాలో ఆయనకు బాగా తెలుసు. దీనికి అనుగుణంగానే రెండ్రోజుల క్రితం కార్పొరేషన్‌లు, పలు సంస్థల చైర్మన్ల నియామకంలో కీలక భూమిక పోషించారు. అయితే బీజేపీ అంతర్గత సర్వేలోనూ జీఎస్టీ, నోట్లరద్దుతో వ్యాపార వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలింది. దీంతో ఈ వర్గాలను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది.
కాంగ్రెస్ గుజ‘రాత’ మారేనా!
అటు, గుజరాత్‌లో అధికారానికి 22 ఏళ్లుగా దూరంగా ఉన్న కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా జెండా ఎగరేయాలనే కృతనిశ్చయంతో ఉంది. దీంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్వయంగా రంగంలోకి దిగి ప్రచార బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్ సహా వివిధ వర్గాల నేతలను కాంగ్రెస్‌లోని చేర్చుకోవటం ద్వారా.. ఆయా వర్గాలను ఆకట్టుకోవచ్చనే ప్రణాళికలతో పనిచేస్తున్నారు. అయితే.. గుజరాత్‌కు సంబంధించి కాంగ్రెస్‌ను నడిపించే నాయకత్వం లేదు. అందుకే బీజేపీ, నరేంద్ర మోదీని లక్ష్యంగా విమర్శలు చేయటంపైనే దృష్టిపెట్టింది. జీఎస్టీ, నోట్లరద్దు కారణంగా దేశ ఆర్థికప్రగతి కుంటుపడిందని విమర్శిస్తోంది. వ్యాపారుల్లో బీజేపీపై అసంతృప్తిని అందిపుచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్, రాష్ట్ర ఇంచార్జ్ అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో కాంగ్రెస్ వ్యూహ కమిటీ పనిచేస్తోంది. కుల రాజకీయాలపైనే దృష్టిపెట్టి సోషల్ ఇంజనీరింగ్‌పై ప్రత్యేకంగా పనిచేస్తోంది. అయితే బీజేపీ విజయ్ రూపానీనే తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించగా.. కాంగ్రెస్ ఇంతవరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment