
గురుగ్రామ్ : ఫోన్ హ్యాకింగ్ బాధితుడి ఫిర్యాదు మేరకు బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మోసానికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విఙ్ఞప్తి చేశారు.
వివరాలు... గురుగ్రామ్‌కు చెందిన హరీష్ చందర్ అనే వ్యాపారవేత్త ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఇన్‌కమ్‌టాక్స్ డిపార్టుమెంటుకు సంబంధించిన అధికారిగా తనను పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి.. తను చెప్పిన యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే సులభ రీతిలో లావాదేవీలు జరపవచ్చని పేర్కొన్నాడు. ఈ క్రమంలో హరీష్ సదరు వ్యక్తి చెప్పినట్లుగానే చేశాడు. అనంతరం అతడు పంపిన లింక్‌ను క్లిక్ చేశాడు. దీంతో హరీష్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ఆటోమేటిక్‌గా వేరే నంబరుకు కూడా వెళ్లింది. ఆ సమయంలో హరీష్ అకౌంట్ నుంచి 60 వేల రూపాయలు డ్రా చేసినట్లుగా మెసేజ్ వచ్చింది. ఈ క్రమంలో తాను మోసపోయినట్లుగా గ్రహించిన హరీష్ బ్యాంకును సంప్రదించగా.. ఫోన్ హ్యాక్ అయినందువల్లే డబ్బులు పోయాయని.. ఈ విషయంలో తామేమీ చేయలేమని చెప్పారు. దీంతో హరీష్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా ఈ విషయం గురించి ఇంటర్నేషనల్ కాలేజ్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్- ఢిల్లీ డైరెక్టర్ రాజ్ సింగ్ నెహ్రా మాట్లాడుతూ.. ‘ ఫోన్లను హ్యాక్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ఇలాంటి లింకులు పంపడం సర్వసాధారణమైపోయింది. మనకు వచ్చింది ఒక లింకుగానే కన్పిస్తున్నా.. దానితో కొన్ని వందలాది లింకులు అనుసంధానమై ఉంటాయి. మనం ఆ లింకును క్లిక్ చేయగానే ఫోన్ హ్యాక్ అవుతుంది. తద్వారా మన డేటా తీసుకున్న హ్యాకర్.. మన వ్యక్తిగత విషయాలతో పాటు ఆర్థిక లావాదేవీలను తెలుసుకుని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతాడు. కాబట్టి అలాంటి లింకులు వచ్చినపుడు స్పందించక పోవడమే మంచిది. లేదంటే సంబంధిత డిపార్టుమెంటు పోర్టల్‌లోకి వెళ్లి ఓసారి చెక్ చేసుకోవాలి’ అని సూచించారు.