
దావూద్‌ను అప్పగించండి
- పాక్‌ను మరోసారి కోరిన భారత్
న్యూఢిల్లీ: మాఫియా డాన్, మోస్ట్‌వాంటెడ్ టైస్ట్ దావూద్ ఇబ్రహీంను అప్పగించాలని పాకిస్తాన్‌ను భారత్ మరోసారి కోరింది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్.. దాయాది దేశంలోనే నివాసం ఉంటున్నట్లు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన.. ‘‘దావూద్ పాక్‌లో ఉన్నాడని మేం ఎప్పటినుంచో చెబుతున్న దానిలో ఏవిధమైన మార్పులేదు.
ఆ డాన్ కరాచీలో ఉన్నాడు. అతన్ని అప్పగించాలని చాలా కాలంగా కోరుతున్నాం. ఇప్పుడు పాక్ స్పందించి దావూద్‌ను భారత్‌కు అప్పగించాలి’’ అని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటానికి పాక్ కట్టుబడి ఉంటే, ఆ విషయంలో భారత్‌కు సహకరించాలని కోరారు. తమకు దావూద్‌ను అప్పగించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కాగా, లక్నోలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ.. దేశానికి సంబంధించి మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ దావూద్ అని చెప్పారు.
అతన్ని అప్పగించాలని పలుమార్లు పాక్‌ను కోరామన్నారు. అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న ప్రశ్నకు.. వేచి చూస్తున్నాం అని బదులిచ్చారు. దావూద్ కరాచీలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, అంతర్జాతీయంగా ఉగ్రవాదులకు కోట్ల రూపాయలు సహాయం చేస్తున్నాడని న్యూస్‌మొబైల్ అనే వెబ్‌పోర్టల్ వెల్లడించిన నేపథ్యంలో భారత్ స్పందించింది.
పాశ్చాత్య దౌత్యాధికారుల నుంచి అందిన టేప్‌ల ఆధారంగా దావూద్ ఆచూకీ తెలిసిందని న్యూస్‌మొబైల్ ఎడిటర్ ఇన్ చీఫ్ సౌరభ్ శుక్లా పేర్కొన్నారు. దావూద్ అఫ్ఘాన్-పాక్ సరిహద్దుల్లో ఉన్నట్లు గత నెలలో రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.