హార్దిక్కు మళ్లీ చుక్కెదురు
సూరత్: దేశద్రోహం కేసులో పటేళ్ల ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన సూరత్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఆయన బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. పటేళ్లకు ఓబీసీ కోటాలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని గుజరాత్ కు చెందిన హార్ధిక్ పటేల్ పెద్ద మొత్తంలో ఉద్యమాన్ని లేవదీసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్యమం ఆందోళన కరంగా మారి ఘర్షణలకు తావిచ్చింది. ఆస్తి నష్టం కూడా చోటుచేసుకుంది. ఆయనపై పలుచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి.
అయితే, ప్రత్యేకంగా ఆత్మహత్యలు చేసుకోవడం ఎందుకు అవసరం అయితే ప్రాణాలు తీయాలని వ్యాఖ్యానించి ఆందోళనకారులను రెచ్చగొట్టాడు. ఉద్యమకారులారా ఆత్మహత్యలు వద్దు అవసరం అయితే పోలీసులను చంపేయండి అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి గత నెల 16న లప్ పోర్ జైలులో వేశారు. దీంతో ఆయన సూరత్ జిల్లా సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తనపై తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టారని అందులో పేర్కొన్నారు. కానీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అక్టోబర్ నుంచే హార్ధిక్ పై దేశ ద్రోహం కేసులు పలు చోట్ల నమోదయ్యాయి.