హవాలా మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంది
హవాలా మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంది
Published Sun, Dec 25 2016 4:35 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
పెద్దనోట్ల రద్దుతో చాలా రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అన్నింటికంటే ఎక్కువగా దెబ్బతిన్నది మాత్రం.. హవాలా మార్కెట్. అవును.. ఢిల్లీలో ఇన్నాళ్లుగా జోరుగా సాగుతున్న హవాలా మార్కెట్ మొత్తం పెద్దనోట్ల రద్దుతో కుప్పకూలింది. కస్టమర్లు రాకపోవడంతో చాలామంది ఏజెంట్లు దుకాణాలు మూసేసుకున్నారు. దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది మాత్రం ఢిల్లీలో ఉన్న గుజరాతీ వ్యాపారులేనని అంటున్నారు. దీపావళి వచ్చిందంటే ఈ దుకాణాల వాళ్లు మొత్తం వ్యాపారం మూసేసి 15-20 రోజుల పాటు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయేపవారని పాత ఢిల్లీలో కొరియర్ సర్వీసు నడుపుకొంటున్న రాకేష్ చెప్పారు. కానీ ఈసారి మాత్రం అలా వెళ్లినవాళ్లు తిరిగి రాలేదని అంటున్నారు. సాధారణంగా హవాలా ఆపరేటర్లు కొంత మొత్తం కమీషన్ తీసుకుని ఎంత పెద్ద మొత్తాలనైనా ఎక్కడినుంచి ఎక్కడికైనా పంపేస్తారు. దీనికి ఎలాంటి అడ్డు అదుపు ఉండేది కాదు. ఎక్కువగా టెర్రరిస్టులు, డ్రగ్ డీలర్లు, ఆయుధాల వ్యాపారులు, ఇతర నేరగాళ్లు ఈ హవాలా నెట్‌వర్కును బాగా వాడుకునేవారు. దేశంలోని ప్రతి చిన్న,పెద్ద నగరాల్లో ఈ హవాలా వ్యాపారులు ఉన్నారు. ప్రధానంగా మాత్రం ఢిల్లీ, ముంబై, గుజరాత్ ప్రాంతాల్లో ఈ వ్యాపారం ఉందని సమాచారం.
తాము ఇంతకుముందు చేసిన వ్యాపారంలో కేవలం 3-5 శాతం వ్యాపారం మాత్రమే ఇప్పుడు సాగుతోందని భారతదేశంతో పాటు పాకిస్థాన్, దుబాయ్ ప్రాంతాల్లో ఉన్న హవాలా ఆపరేటర్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి తాము వ్యాపారం మూసేసి తమ ఊరు వెళ్లిపోయామని ఒక పెద్ద హవాలా డీలర్ చెప్పాడు. పెద్దనోట్ల రద్దుకు ముందు తీసుకున్న నోట్లు చాలా పెద్దమొత్తంలో వీళ్ల వద్ద ఉండిపోయాయని, దానివల్ల ఇప్పుడు వీళ్లు దివాలా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.
20 లక్షల పాత నోట్లు మార్చాలని ఒక జాతీయ పత్రిక ప్రతినిధి మామూలు కస్టమర్‌లా వెళ్లి అడిగితే హవాలా ఆపరేటర్ కుదరదన్నారు. పోనీ కొత్త నోట్లయినా సరే 20 లక్షలను ముంబై పంపాలని కోరగా.. మహా అయితే 4-5 లక్షలు పంపగలనని చెప్పారు. కొత్త నోట్ల అందుబాటు చాలా తక్కువగా ఉండటంతో తాము ఏమీ చేయలేక అలా ఒక పక్కన కూర్చుంటున్నామని ఆపరేటర్లు అంటున్నారు. అయితే ప్రస్తుతానికి 10 శాతం కమీషన్ తీసుకుని నల్లడబ్బును తెల్లగా మారుస్తూ పొట్ట పోసుకుంటున్నట్లు చెబుతున్నారు.
Advertisement
Advertisement