బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులు కాల్చొద్దు..
కొచ్చిః కేరళ హైకోర్టు స్థానిక ప్రజలకు ప్రత్యేక తీర్పునిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్, రబ్బర్ వంటి వస్తువులను తగులబెట్టడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా, పౌర సంబంధిత సంస్థలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందంటూ హెచ్చరించింది.
బ్రీత్ ఈజీ కార్యక్రమంలో భాగంగా కేరళ హైకోర్టు ప్రత్యేక నిర్ణయం తీసుకొంది. రబ్బర్, ప్లాస్టిక్ వంటి వస్తువులను తగులబెట్టడం వల్ల వచ్చే పొగతో వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాక, అనేక శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉండటంతో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. అటువంటి పనులను నిషేధిస్తూ నిబంధనలను విధించింది.
కోర్టు ఆదేశాలను ధిక్కరించి, అటువంటి పనులకు పాల్పడేవారిపై పోలీసులు సైతం సుమోటో కేసులను ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవాలంటూ ఛీఫ్ జస్టిస్ తొట్టత్తిల్ బి. రాధాకృష్ణన్, అను శివరామన్ లతో కూడిన ధర్మాసనం సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులపెట్టడాన్ని నిషేధిస్తూ కోర్టు ఈ కొత్త ఆదేశాలను జారీ చేసింది.