హరియాణా ప్రభుత్వానికి హైకోర్టు చివాట్లు
సాక్షి, హరియాణా: పంజాబ్, హరియాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు హరియాణా సర్కారుకు శనివారం చివాట్లు పెట్టింది. రాజకీయంగా లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం 'పంచకుల'ను తగులబెట్టేలా చేసిందని కోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ కోర్టు తీర్పు అనంతరం రెచ్చిపోతున్న డేరా సచ్చా సౌధా అనుచరులను కట్టడి చేయకుండా వారికి ప్రభుత్వం లొంగిపోయిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. గుర్మీత్ కోర్టుకు వెళ్తున్న సమయంలో అన్ని వాహనాలను ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు.
పంచకుల తగులబడటానికి కారణమైన ఇద్దరు గుర్మీత్ అనుచరులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. గుర్మీత్ ఆస్తుల వివరాలను ఈ నెల 29లోగా కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, పంచకుల సీబీఐ తీర్పుకు 72 గంటల ముందు నుంచే హరియాణా ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది.
సున్నితమైన ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సేవలను కూడా నిలిపివేసింది. అయితే, డేరా అనుచరుల దుశ్చర్యల ముందు పోలీసు శక్తి సరిపోలేదు. కాగా, ప్రస్తుతం ఆర్మీ, పారామిలటరీ బలగాలు సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయం నుంచి అనుచరులను బయటకు తరలించేందుకు యత్నిస్తున్నాయి. పంచకుల ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ఖట్టర్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.