మరో వివాదంలో రాధే మా
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా కు మరోసారి చుక్కెదురైంది. త్రిశూలం ధరించి విమానంలో ప్రయాణించిన కేసులో దాఖలైన పిటిషన్ పై శుక్రవారం ముంబై హైకోర్టు స్పందించింది. ఈ కేసులో కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒక సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 18లోగా దీనికి సమాధానం చెప్పాలని జస్టిస్ విఎం కనాడే, షాలిన్ ఫానల్కార్ లతో కూడిన బెంచ్ ఆదేశించింది.
ఈ ఏడాది ఆగస్టులో ఔరంగాబాద్ నుండి ముంబైకి ఓ ప్రయివేటు విమానంలో రాధే మా ప్రయాణిస్తున్న సమయంలో త్రిశూలంతో ప్రయాణించడంపై సామాజిక కార్యకర్త రమేష్ జోషి వ్యాజ్యం దాఖలు చేశారు. మారణాయుధం లాంటి త్రిశూలాన్ని విమానంలో తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ చర్య ద్వారా సివిల్ యావియేషన్ నిబంధనలను ఆమె అతిక్రమించారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాధేమా మరింత ఇరకాటంలో పడ్డారు. రాధే మా మినీస్కర్టులో ఉన్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీంతోపాటు డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులు, వరకట్న వేధింపులు తదితర నేరాలతో పాటు మరికొన్ని కేసుల్లో ఆమెను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.