'ఈ నల భీముడు కెవ్వు కేక'
అలహాబాద్: వంట చేసే సమయంలో కాస్త దగ్గరగా ఉంటేనే ఆ వేడికి భయపడి దూరంగా జరుగుతుంటాం. అలాంటిది ఏకంగా సలసల కాగే నూనెలో చేతులు ముంచుతూ వంటలు చేస్తే ఎలా ఉంటుంది. మాములుగా అయితే, చర్మం ఊడిపోదూ..! కానీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన రాంబాబు అనే 60 ఏళ్ల వ్యక్తి ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 40 ఏళ్లుగా ఇలాగే తన బజ్జీల బండిదగ్గర పిండివంటలు తయారు చేస్తున్నాడు. గరిటె సహాయం లేకుండా చకచకా ఘుమఘుమలాడే పిండివంటలు చేస్తున్నాడు. ఇది చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగించడంతోపాటు ఆ చర్య ఒక బ్రాండ్ గా మారి తన బండి వద్ద ఎప్పుడూ ఆహార ప్రియుల సందడితో కళకళలాడేలా చేసింది. 200 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉండే ఈ నూనెలో అతడు చేతి వేళ్లను పిండితో ముంచుతాడు.
అవి పూర్తిగా కాలాక తీసి పక్కకు వేస్తుంటాడు. దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కొందరు అతడిని ప్రశ్నించగా 'నేను సలసల కాగే నూనెలో చేతిని ముంచుతూ పకోడీలు తయారుచేసే విధానం చూసేందుకు చాలా దూరం నుంచి వస్తుంటారు. నేను 40 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కాలిన గాయాలు అవలేదు' అంటూ చెప్పాడు. 20 ఏళ్లనాటికే ఆలు బజ్జీలు వేయడం నేర్చుకున్నానని, తన బడ్డీ కొట్టు ఇంత ఫేమస్ అవుతుందని అస్సలు ఊహించలేదని చెప్పాడు. గరిటెతో పిండివంటలు తయారు చేసి వాటిని తీయడం కాస్త ఎక్కువ టైం తీసుకుంటుందని, అందుకే తాను నేరుగా చేతిని ఉపయోగించి స్నాక్స్ తయారు చేయడం ప్రారంభించానని చెప్పాడు. దీంతో ఇప్పటి వరకు అతడు గరిటె లేకుండానే పిండివంటలు చేసి అబ్బుర పరుస్తున్నాడు.