దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై జరిగిన 26/11 దాడి కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ హెడ్లీ విచారణ బుధవారం ప్రారంభమైంది. ఈ విచారణలో తన వ్యక్తిగత అంశాల విచారణపై అభ్యంతరం వ్యక్తంచేసిన హెడ్లీ కొన్ని సంచలన విషయాలను వెల్లడించాడు. 2002 తరువాత దుబాయ్, పాకిస్తాన్‌లో పెట్టుబడులు పెట్టానని, అక్కడ తనకు కొన్ని షాపులు కూడా ఉన్నట్లు విచారణలోఅంగీకరించాడు. డ్రగ్స్, అక్రమ ఆయుధ వ్యాపారాన్ని నిర్వహించానని కూడా డేవిడ్ హెడ్లీ ఒప్పుకున్నాడు.
అమెరికాలో ఉన్న హెడ్లీని వీడియో లింక్ ద్వారా విచారిస్తున్నారు. తన భార్య షాజియా గిలానీ గురించిన సమాచారాన్ని వెల్లడించేందుకు మాత్రం హెడ్లీ నిరాకరించాడు. తన గురించి అడగాలని, అంతేతప్ప తన భార్య గురించి మీకెందుకని విచారణ అధికారులను ఎదురు ప్రశ్నించాడు. తనకు లష్కరే తాయిబాతో సంబంధాలు ఉన్న విషయం తన భార్యకు తెలుసన్నాడు. పాకిస్తాన్‌కు చెందిన జెబ్ షా అనే వ్యక్తి అక్కడి డ్రగ్ వ్యాపారానికి సహకరించాడని విచారణలో హెడ్లీ తెలిపాడు. భారత్ లోకి ఆయుధ అక్రమ రవాణాలో ఆసక్తి చూపిన అతనితో కలిసి 2006లో అక్రమ వ్యాపారానికి తెరతీసినట్టు తెలిపారు. 1992 నుంచి మత్తు మందుల వ్యాపారంలో ఉన్నాననీ, 1988 జైలునుంచి విడుదలైనప్పటినుంచీ, తిరిగి 1998 మళ్లీ జైలుకెళ్లేదాకా ఈ వ్యాపారాన్ని కొనసాగించినట్టు హెడ్లీ తెలిపాడు. లష్కర్ తాయిబా నుంచి తనకు నిధులు అందలేదని, తానే వారికి నిధులు సమకూర్చానని విచారణలో వెల్లడించాడు. పాకిస్తాన్ లాహోర్ లో ఉన్నప్పుడు పంజాబీ నేర్చుకున్నానన్నాడు. మరో లష్కరే ఉగ్రవాది తహావుర్ రాణాతో తనకు పరిచయం ఉన్నట్లు హెడ్లీ అంగీకరించాడు. అయితే లష్కర్ తో మాత్రం రాణాకు సంబంధాలు లేవన్నాడు. 26/11 కుట్ర సందర్భంగా ఆయన కార్యాలయాన్ని వాడుకున్నామని తెలిసిన తరువాత రాణా తనను కార్యాలయం నుంచి తొలగించినట్టు చెప్పాడు. ముంబై దాడుల కోసం ప్రణాళిక వేయడంలో హెడ్లీకి రాణా సహకరించాడన్న ఆరోపణలున్నాయి.
పాక్‌కు చెందిన ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నట్లు గత విచారణలో హెడ్లీ అంగీకరించిన విషయం తెలిసిందే. అబూ జుందాల్ లాయర్ అబ్దుల్ వహాబ్ ఖాన్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ సమక్షంలో హెడ్లీ విచారణ సాగింది. ముంబై క్రైం బ్రాంచ్ చీఫ్ అతుల్ కులకర్ణి కూడా పాల్గొన్న ఈ విచారణ మధ్యాహ్నం వరకు కొనసాగింది.