పాక్‌ సరిహద్దు దాడులు ఆగేదెప్పుడు ? | Heavy Fire On LOC From Pakistan Side | Sakshi
Sakshi News home page

పాక్‌ సరిహద్దు దాడులు ఆగేదెప్పుడు ?

Published Thu, Mar 7 2019 3:17 PM | Last Updated on Thu, Mar 7 2019 6:56 PM

Heavy Fire On LOC From Pakistan Side - Sakshi

పాక్‌ కాల్పుల్లో ధ్వంసమైన ఇల్లు( అంతర్‌ చిత్రంలో కుటుంబసభ్యులను కోల్పోయిన బాధితురాలు)

సాక్షి, న్యూఢిల్లీ : అది మార్చి ఒకటవ తేదీ. వాఘా సరిహద్దులో భారత వింగ్‌ కమాండర్‌ అభినందన వర్తమాన్‌కు ఘన స్వాగతం చెప్పేందుకు సైనికులు, పౌరులు పెద్ద ఎత్తున బారులు తీరారు. మరో పక్క బాణా సంచా పేలుళ్లతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంది. దీనికి సంబంధించిన వార్తలను తారిక్‌ హుస్సేన్‌ అనే 24 ఏళ్ల సలోత్రి గ్రామస్థుడు ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తున్నాడు. సమయం రాత్రి 9.18 గంటలు కావొస్తోంది. ఇంతలో ఇంటి ముందు భారీ పేలుడు శబ్దం. ఒక్కసారి కాళ్ల కింద భూమి కంపించి పోయింది. 

ఏదో శతఘ్ని మందు గుండు వచ్చి పడి ఉంటుందని అనుకున్నాడు తారిక్‌ హుస్సేన్‌. ఇంట్లో ఉన్నవాళ్ల ఎవరూ కదల్లేదు. మరో గుండు వచ్చి పడొచ్చని వారంతా భయం భయంగా ఒకరికొకరు దగ్గరగా ఉండిపోయారు. మరికొన్ని క్షణాల్లోనే మరో భారీ పేలుడు. సలోత్రి గ్రామం వణికి పోయింది. ఈ సారి రెండో శతఘ్ని గుండు తారిక్‌ హుస్సేన్‌ ఇంటికి 25–30 మీటర్ల దూరంలో ఉన్న ఆయన మామ మొహమ్మద్‌ అస్లాం ఇంటిపై పడి పేలింది. ఈ పేలుడులో ఐదేళ్ల మొహమ్మద్‌ ఫైజాన్, పది నెలల శబ్నం, ఆ ఇద్దరు పిల్లల తల్లి రుబీనా కౌన్సర్‌ మరణించారు.

ఆమె భర్త యూనిస్‌ తీవ్రంగా గాయపడ్డారు. మొదటి పేలుడుతో అప్రమత్తమైన యూనిస్‌ తండ్రి మొహమ్మద్‌ అస్లాం లేచి, భార్యా పిల్లలను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాల్సిందిగా కొడుకూ యూనిస్‌కు చెప్పి ఇంటి ముందుకెళ్లాడు. ఇంతలో ఇంటి మీద బాంబు పడింది. ఆ సమయంలో రుబీనా కౌన్సర్‌ తన పది నెలల పాపకు పాలిస్తోంది. పేలుడు తీవ్రతకు ఆ తల్లి, ఆ పాప తలలు తెగిపడ్డాయి. సలోత్రి గ్రామం జమ్మూలోని పూంచ్‌ జిల్లాలో ఉంది. ఈ గ్రామం వాస్తవాధీన రేఖ (ఎల్‌ఓసీ)కు సమీపంలో ఉంది. అక్కడి నుంచి సరిహద్దుకు ఆవల ఉన్న పాకిస్థాన్‌ గ్రామాలు కూడా కనిపిస్తాయి.

1971 పాకిస్థాన్‌తో యుద్ధం తర్వాత ఈ స్థాయిలో శతఘ్ని గుండ్లు వచ్చి పడడం ఇదే మొదటి సారని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలోని చాలా ఇళ్లకు తుపాకీ, మోర్టార్‌ గుళ్లు తగిలిన చాలా ఇళ్లకు కనిపిస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ వైమానిక దాడులు జరిపిన మరుసటి రోజు నుంచే పాకిస్థాన్‌ వైపు నుంచి ఇలాంటి దాడులు పెరిగాయి. రాజౌరి జిల్లాలో కూడా ఇలాంటి దాడులు జరిగాయని, ఆ దాడుల్లో నలుగురు పౌరులు చనిపోయారని భారత సైన్యం అధికార ప్రతినిధి దేవేందర్‌ ఆనంద్‌ తెలిపారు. సరిహద్దుకు ఆనుకొని ఉన్న 25 ప్రాంతాలపై పాకిస్థాన్‌ సైనికులు రోజుకు రెండు, మూడు సార్లు మోర్టార్‌ దాడులు జరుపుతున్నారని ఆయన తెలిపారు.

ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడపా దడపా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇద్దరో ముగ్గురో పౌరులు చనిపోతూనే ఉన్నారు. ఇలా పాక్‌ దాడుల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాని కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల చొప్పుక నష్టపరిహారం ఇస్తుంది. ఇల్లు ధ్వంసం అయితే మరో ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తుంది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కోరుకుంటే మాత్రం తొమ్మిది లక్షల నష్టపరిహారానికి బదులు ఒక లక్ష పరిహారం వస్తుంది. గాయపడిన వారందరి చికిత్సకు అయ్యే ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే ఆస్పత్రి బిల్లులను సమర్పిస్తే తర్వాత రీఎంబర్స్‌మెంట్‌ చేస్తుంది. పస్తుతం చికిత్సకు డబ్బులు లేవంటా విలపిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement