
తమిళనాడుకు మళ్లీ భారీ వరద ముప్పు!!
ఇటీవలే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమిళనాడు మరోసారి వరద బారిన పడే ప్రమాదం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశగా కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగాను, ఆ తర్వాత తుపానుగాను మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చె్నై, కడవల్లూరు, తిరువళ్లూరు, తిరువణ్ణామలై, కాంచీపురం, తిరువత్తయూర్, రామేశ్వరం, కన్యాకుమారి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా 1913, 1070 హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది.
మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తాజాగా స్పష్టంచేసింది. కేంద్రీకృతమైన అల్పపీడన ద్రోణి శ్రీలంక వైపు వెళుతుండటంతో తమిళ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కేంద్రం నుంచి 4 బెటాలియన్లు సహాయక చర్యలకు అక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే అన్నీ ప్రాంతాల్లో రోడ్లపై నీరు వరదలుగా ప్రవహించడం, అక్కడక్కడా చెట్లు విరిగిపోయి అడ్డుగా మారడంతో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపయ్యాయి. లోతట్టు ప్రాంతాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ఏమైనా అవసరం ఉంటే కచ్చితంగా తమ హెల్ప్ లైన్ కేంద్రాలకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో దక్షిణ కో స్తాలోని ప్రధాన ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హె చ్చరిక జారీ చేశారు. ఉత్తరకోస్తాలోని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను కేంద్రం హెచ్చరించింది. వర్షాలు భారీ నుంచి అతి భారీగా పడే ప్రమాదం ఉందని, అందువల్ల అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జానకి చెప్పారు.