
హారన్ కొడితే.. ఇక భారీ ఫైన్!
రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది.. ముందు కనీసం పాతిక నుంచి యాభై వరకు వాహనాలు ఉంటాయి. ఆ వెనకాల నుంచి ఒకటే హారన్ మోతలు. ముందు వాహనాలు కదిలే పరిస్థితి లేదని తెలిసినా, తమకు దారి ఇవ్వాలంటూ హారన్ కొట్టేవాళ్లను చూస్తే ఎక్కడలేని కోపం వస్తుంది. ఇలాంటి పరిస్థితి మన దేశంలో సర్వసాధారణం. దీనివల్ల శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే ఇలా అవసరం లేకపోయినా హారన్ కొట్టేవారికి రూ. 500 నుంచి రూ. 5వేల వరకు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మల్టీ టోన్ ఎయిర్ హారన్లు బిగించే డీలర్లు, గ్యారేజి యజమానులకు లక్ష రూపాయలు కూడా వడ్డన పడే అవకాశం ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించి, మోటారు వాహన చట్టానికి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సవరణలు చేయాలని కేంద్రం తలపెడుతోంది.
హారన్లు కొట్టేవాళ్లకు జరిమానాలు వడ్డించాలన్న ప్రతిపాదనలకు వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు కూడా ఆమోదం తెలిపారు. నిబంధనలను మొదటిసారి ఉల్లంఘిస్తే రూ. 500, రెండోసారి అయితే వెయ్యి రూపాయల చొప్పున ఫైన్ వేస్తారట. ఏదైనా వాహనాన్ని ఓవర్ టేక్ చేయాలంటే హెడ్లైట్ ఫ్లాష్ చేయడంతో పాటు చిన్నగా ఒకసారి హారన్ కొడితే తప్పులేదు గానీ, అనవసరంగా పదే పదే మోగించేవాళ్లకు మాత్రం జరిమానాలు తప్పవట. నివాస ప్రాంతాలతో పాటు సైలెంట్ జోన్లుగా పేర్కొనే ప్రాంతాలలో కూడా హారన్లు మోగించకూడదు. ప్రధానంగా స‍్కూళ్లు, ఆస్పత్రులు ఉన్నచోట హారన్ కొట్టకూడదన్న బోర్డులు ఉన్నా.. వాటిని ఎవరూ పట్టించుకోరు. ఇలాంటివాళ్లను అదుపుచేయడానికే జరిమానాలు వేయబోతున్నారు.