hefty fines
-
లైసెన్సు లేకుండా నడిపితే.. 5వేల ఫైన్!
మోటారు వాహనాల చట్టం వసరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దీని ప్రకారం ఇప్పటివరకు ఉన్న జరిమానాలన్నీ భారీగా పెరిగిపోనున్నాయి. లైసెన్సు లేకుండా వాహనాలు నడిపేవారికి ఇంతకుముందు రూ. 500 జరిమానా విధిస్తుండగా అది 5 వేలకు చేరుకుంది. అలాగే డ్రంకెన్ డ్రైవింగ్‌కు గతంలో రూ. 2వేల జరిమానా విధిస్తే, ఇప్పుడది రూ. 10 వేలకు పెరిగింది. హెల్మెట్ లేకపోతే గతంలో వంద రూపాయలు కడితే సరిపోయేది. ఇప్పుడు వెయ్యి కట్టడంతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్ కూడా సస్పెండవుతుంది. ప్రయాణికులను ఓవర్లోడింగ్ చేస్తే, ఒక్కొక్కరికి వెయ్యి చొప్పున కట్టాలి. మైనర్లు వాహనం నడిపినప్పుడు ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే, వాళ్ల తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. అలాగే బాధితుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పదిరెట్లు పెంచారు. థర్డ్ పార్టీ బీమా, టాక్సీ సంస్థల నియంత్రణ, రహదారి భద్రత లాంటి పలు అంశాలపై కూడా ఈ కొత్త బిల్లు స్పష్టతనిస్తుంది. కొత్త చట్టం ప్రకారం మోటారు వాహన ప్రమాదాల్లో థర్డ్ పార్టీ బాధ్యత అపరిమితం అవుతుంది. ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ. 5 లక్షల చొప్పున చెల్లించాలి. రోడ్డు మీద నడిచే అన్ని వాహనాలకు తప్పనిసరిగా బీమా ఉండాలని నిర్దేశిస్తోంది. పిల్లలు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులు, గార్డియన్లను బాధ్యులుగా చేస్తోంది. దాంతోపాటు.. వాహనం రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేస్తున్నారు. -
హారన్ కొడితే.. ఇక భారీ ఫైన్!
రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది.. ముందు కనీసం పాతిక నుంచి యాభై వరకు వాహనాలు ఉంటాయి. ఆ వెనకాల నుంచి ఒకటే హారన్ మోతలు. ముందు వాహనాలు కదిలే పరిస్థితి లేదని తెలిసినా, తమకు దారి ఇవ్వాలంటూ హారన్ కొట్టేవాళ్లను చూస్తే ఎక్కడలేని కోపం వస్తుంది. ఇలాంటి పరిస్థితి మన దేశంలో సర్వసాధారణం. దీనివల్ల శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే ఇలా అవసరం లేకపోయినా హారన్ కొట్టేవారికి రూ. 500 నుంచి రూ. 5వేల వరకు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మల్టీ టోన్ ఎయిర్ హారన్లు బిగించే డీలర్లు, గ్యారేజి యజమానులకు లక్ష రూపాయలు కూడా వడ్డన పడే అవకాశం ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించి, మోటారు వాహన చట్టానికి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సవరణలు చేయాలని కేంద్రం తలపెడుతోంది. హారన్లు కొట్టేవాళ్లకు జరిమానాలు వడ్డించాలన్న ప్రతిపాదనలకు వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు కూడా ఆమోదం తెలిపారు. నిబంధనలను మొదటిసారి ఉల్లంఘిస్తే రూ. 500, రెండోసారి అయితే వెయ్యి రూపాయల చొప్పున ఫైన్ వేస్తారట. ఏదైనా వాహనాన్ని ఓవర్ టేక్ చేయాలంటే హెడ్‌లైట్ ఫ్లాష్ చేయడంతో పాటు చిన్నగా ఒకసారి హారన్ కొడితే తప్పులేదు గానీ, అనవసరంగా పదే పదే మోగించేవాళ్లకు మాత్రం జరిమానాలు తప్పవట. నివాస ప్రాంతాలతో పాటు సైలెంట్ జోన్లుగా పేర్కొనే ప్రాంతాలలో కూడా హారన్లు మోగించకూడదు. ప్రధానంగా స్కూళ్లు, ఆస్పత్రులు ఉన్నచోట హారన్ కొట్టకూడదన్న బోర్డులు ఉన్నా.. వాటిని ఎవరూ పట్టించుకోరు. ఇలాంటివాళ్లను అదుపుచేయడానికే జరిమానాలు వేయబోతున్నారు.